దివ్య బాలయేసుకు మహత్తర శక్తిగల జపము

ఓ దివ్య బాలయేసువా! “అడుగుడు మీ కొసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును”

అని చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాతయైన కన్యమరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థనను ఆలకించి నేనిప్పుడు తట్టుచు, వెదకుచు అడుగుచున్న యీ వరమును అనుగ్రహించండి.
(నీ కోరికను తెలుపుము)

ఓ దివ్య బాలయేసువా! “మీరు నా పేరిట తండ్రిని యేమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించును,” అని మీరు సెలవిచ్చిన ప్రకారము మీ పవిత్ర మాతయైన కన్యమరియమ్మ వేడుదల ద్వారా నా మనవిని దయచేయమని మీ నామమున మీ దివ్య పితను ఆతృతతో వేడుకొనుచున్నాను.
(నీ కోరికను తెలుపుము)

ఓ దివ్య బాలజేసువా! “భూమ్యాకాశములు గతించిపోవును. గాని నా మాటలు యెన్నడును గతించిపోవు.” అని పలికిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాతయైన కన్యమరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని దృఢనమ్మకము కలిగియున్నాను. ఆమెన్.

బాలయేసు ప్రార్థన

ప్రభువా ! దయ చూపండి.
క్రీస్తువా! దయ చూపండి
ప్రభువా ! దయ చూపండి.

క్రీస్తువా! మా ప్రార్థన విననవధరించండి
క్రీస్తువా! మా ప్రార్థన ప్రకారము దయచేయండి

పరలోకమందుండెడు పితయైన సర్వేశ్వరా!
అం : మా మీద దయగానుండండి

లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా!
జీవ ప్రదాతయగు పవిత్రాత్మయైన సర్వేశ్వరా!

అద్భుత శక్తిగల దివ్య బాలయేసువా!
మీ మహత్తర శక్తిని అద్భుత విధమున వెల్లడిచేసిన దివ్య బాలయేసువా!
నిజమైన దేవుడును, నిజమైన రాజువైన, దివ్య బాల యేసువా!
మా అంతరంగ ఆత్మలను పరిశీలించి పాలింప జ్ఞానముగల దివ్య బాలయేసువా!
ఎల్లవేళల మాకు తోడ్పడుటకు ఆశించు, దివ్య బాలయేసువా!
మమ్ము ఆదరణతో, మా గమ్యస్థానమునకు నడిపించు దివ్య బాలయేసువా!
మా హృదయములనుండి, అంధకారమును పారద్రోలు సత్య వెలుగైన దివ్య బాలయేసువా!
మీ ఔదార్యముచే, మా దారిద్ర్యమును పోగొట్టిన దివ్య బాలయేసువా!
సకల బాధలనుండి మాకు ఉపశమనము నొసగు స్నేహమైన దివ్య బాలయేసువా!
మా పాపములను మీ అనంత కరుణతో క్షమించు దివ్య బాలయేసువా!
మీ అద్భుత శక్తితో మమ్ము బలపరచు దివ్య బాలయేసువా!
పిశాచి శక్తులను మీ అపార శక్తిచే పారద్రోలిన! దివ్య బాలయేసువా!
మీ నీతిచే మమ్ము దోషక్రియలనుండి దూరము చేయుచున్న దివ్య బాలయేసువా!
నరక వాకిళ్ళను జయింప సామర్థ్యము గల దివ్య బాలయేసువా!
మీ ప్రేమానుగ్రహ ముఖ లావణ్యముచే అందరిని ఆకర్షించు దివ్య బాలయేసువా!
జగమును మీ హస్తమునందు దాల్చిన మహాత్మ్యము గల దివ్య బాలయేసువా!
మీ హృదయ ప్రేమాగ్నిచే మా నులివెచ్చని హృదయములను రగిలించు దివ్య బాలయేసువా!
దీవింప యెత్తబడిన మీ అద్భుత కరముచే మమ్ము సకల ఆశీర్వాదములతో నింపు దివ్య బాలయేసువా!
మీ విశ్వాసుల మనస్సులు రంజిల్లు, మధుర నామము ధరించిన దివ్య బాలయేసువా!
ప్రపంచ మంతయు మీ మహిమతో నింపిన దివ్య బాలయేసువా!

దయాపరులై యుండి అం : మమ్ము రక్షించండి స్వామి
దయాపరులై యుండి అం : మా ప్రార్థన నాలకించండి స్వామి
సకల కీడుల నుండి అం : మమ్ము రక్షించండి స్మామి
సకల పాపముల నుండి అం : మమ్ము రక్షించండి స్వామి

మీ మితిలేని మంచి తనము పై గల అవిశ్వాసము నుండి
మీ అద్భుత శక్తిపట్ల మా అపనమ్మకము నుండి
మిమ్ము పూజించుటలో మేము చూపిన నిర్లక్ష్యము నుండి
సకల ఆపదలు దురదృష్టముల నుండి
మీ దివ్య మాతయైన కన్యమరియాంబ, సాకుడు తండ్రియైన యోసేపుగారి మధ్యవర్తిత్వము ద్వారా వేడుకొనుచున్నాము.
అం : మా ప్రార్థననాలకించండి స్వామి

మమ్ము దయతో క్షమింపుడని వేడుకొనుచున్నాము
మీ ద్యి బాల్యమందు మా భక్తి ప్రేమను స్థిరపరచి పెంపొందించుమని వేడుకొనుచున్నాము
మీ మహిమాన్విత హస్తమును మా పై నుండి తొలగింపరాదని వేడు కొనుచున్నాము.
మీరొసగిన లెక్కలేని మేలులను మేము మరువకుండునట్లు చేయమని వేడుకొను చున్నాము
మీ పవిత్ర హృదయముపట్ల, మా ప్రేమను అధికాధికముగా ప్రజ్వరిల్లి చేయుమని వేడుకొనుచున్నాము
నమ్మికతో మిమ్ము శరణువేడిన వారిని కరుణతో ఆలించి పాలించుమని వేడుకొనుచున్నాము
మా దేశమునందు, శాంతి భద్రతలు పెంపొందించుమని వేడుకొను చున్నాము

రానున్న సకల విపత్తుల నుండి మమ్ము విముక్తి చేయుమని వేడుకొనుచున్నాము
మీ యెడల ఔదార్యముగల వారందరికి నిత్య జీవమును అనుగ్రహింపుమని వేడుకొనుచున్నాము
మీరు తీర్పు తీర్చునపుడు మా యెడ దయాపూరిత వాక్కును ఉచ్చరింపుమని వేడుకొనుచున్నాము
మీ అద్భుత స్వరూపము ద్వారా మాకు ఊరటగాను శరణముగాను ఉండుమని వేడుకొనుచున్నాము.
దైవ కుమారుడును, మరియ తల్లి తనయుడునైన బాల యేసువా మిమ్మునే వేడుకొనుచున్నాము .

సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా (3 సార్లు)
- ఏసువా! మా పాపములను మన్నించండి.
- ఏసువా! మా ప్రార్థన ప్రకారము దయచేయండి.
- ఏసువా! మా మీద దయగానుండండి.

1పర - 1మం. - త్రీత్వ

ప్రార్థించుదము :
అద్భుత శక్తిగల ఓ దివ్య బాల యేసువా! మా విపత్తులలో మమ్ము కరుణా కటాక్షముతో వీక్షింపుమని మీ యెదుట సాష్టాంగపడి పడుచున్నాము. మా వేడుదల వలన మీ మృదు మధుర హృదయము దయాపూరితమై మేము అత్యంత ఆశక్తితో అడుగు వరములను అనుగ్రహించును గాక! మమ్కు ఆవరించియున్న సకల బాధలను, శోధనలను, దుఃఖములను దురదృష్టములను తొలగించండి. మేము పిత పవిత్రాత్మలతో మిమ్ము నిత్యకాలము స్తుతించుదము గాక! ఆమెన్