ఘనంగా విశాఖపురి మేరిమాత మహాత్సవము

ఘనంగా విశాఖపురి మేరిమాత మహాత్సవము

విశాఖ కొండగుడిలో అమలోద్భవి మాత మహోత్సవం ఘనంగా జరిగింది. పాతపోస్టాఫీస్ ప్రాంతంలోని కొండగుడి(రోజ్ హిల్) కొండపై కొలువైన అమలోద్భవి మాత(విశాఖ పురి మేరీమాత) ను దర్శించుకునేందుకు అశేష భక్తజనం తరలివచ్చింది.

ఏడాదికి ఒకసారి జరిగే ఈ మహోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కూడా వచ్చిన భక్తులతో విశాఖ నగరం జనసంద్రమైంది. కుల, మతాలకు అతీతంగా ప్రజలు తరలి వచ్చి పరమత సహనానికి ప్రతీకగా నిలిచారు. ప్రభు యేసుక్రీస్తుకు జన్మనిచ్చి, ప్రపంచాన్ని పునీతం చేసిన మేరీమాతను కనులారా చూడాలని భక్తులు గంటల కొద్దీ నిరీక్షించారు. కొండగుడి ఉత్సవాన్ని చూసి భక్తి తన్మయత్వంలో మునిగిపోయారు.

ఎప్పటిలానే నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు నవదిన ప్రార్ధనలు జరిగాయి. డిసెంబర్ 8వ తేదీన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం దేవాలయం వద్ద ఆంగ్లంలో, తెలుగులో వేర్వేరుగా దివ్య పూజ జరిపారు. ఉదయం 4.30గంటల నుంచి దివ్య పూజాబలిలు ప్రారంభమైనాయి. 350 మంది వలంటీర్లు, 50 మంది పైగా గురువులు, సిస్టర్స్ మరియు బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు.

నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య థమన్ కుమార్ గారు ఉదయం కొండ పై గృహ దగ్గర 7.30గంటలకు ఇతర గురువులతో కలసి సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించారు.

మధ్యాహ్నం పాతపోస్టాఫీస్ వద్ద ఉన్న సెయింట్ అలోసిస్ పాఠశాల నుంచి అధికసంఖ్యలో భక్తులు మేరీమాత స్వరూపంతో ప్రదక్షిణగా కొండపై ఉన్న ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు.

మేరీమాతను దర్శించుకొని కొవ్వొత్తులు వెలిగించిన భక్తులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ కొండల జోసెఫ్ పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer