పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)

 అస్సీసి పుర ఫ్రాన్సిస్ గారు  12వ శతాబ్దంలో జీవించిన గొప్ప పునీతుడు, మహనీయుడు. ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి ఉండరు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహ, సేవా భావాలతో జీవించాడు.  

ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ. 1182లో జన్మించారు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌, తల్లి పీకా. తండ్రి పెద్ద బట్టల వ్యాపారి. యుక్త వయస్సులో గొప్ప యోధుడుగా కావాలని కళలు కన్నాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు.

పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డాడు. చెరసాలలో కూడా అందరితో కలవిడిగా తిరుగాడుచూ చతురోక్తులతో నవ్వించేవాడు. చెరనుండి విడుదల అయిన కొద్ది రోజులకు తీవ్రజబ్బున పడ్డాడు. కోలుకున్నాక, ఆపూలియా వెళ్ళు త్రోవలో ప్రభువు స్వరాన్ని విన్నాడు: ‘‘ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా, సేవకుడినా?’’  ‘‘యజమానుడిని’’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం ఇచ్చాడు. మళ్ళీ ఆ స్వరం, ‘‘కాని, నీవు యాజమానుడిని గాక, సేవకుడిని సేవిస్తున్నావు’’ అని పలికింది. అప్పుడు, ఫ్రాన్సిస్‌, ‘‘అయితే, నన్నేమి చేయమంటారు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్వరం, ‘‘నీవు తిరిగి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు’’ అని చెప్పింది. ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్త ధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానం చేసాడు. రోము నగరములోని పునీత పేతురు సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేయాలని తీర్మానించుకున్నాడు.

క్రీ||శ|| 1209 ఫ్రిబ్రవరిలో పునీత దమియాను గుడిలో పూజలో పాల్గొనియుండగా పూజ గురువు డ్పా యెత్రాగారు మత్తయి సువార్త పదవ అధ్యాయంలోని 7 నుండి 9వ వచనం వరకు చదివి ఉపదేశించారు. క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం’’ ఫ్రాన్సిస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ వాక్కులే తనకూ మూల సూత్రంగా నెంచుకున్నారు.ఇలా దైవ చిత్తాన్ని అన్వేషించాడు.

దేవుని సేవలో ఫ్రాన్సిసుగారు గొప్ప బోధకుడని దేశమంతటా ప్రాకింది. వారి బోధలు హృదయస్పందనను కలిగించేది.

ఒకసారి ఫ్రాన్సిసుగారు బోధించుటకు గుచ్చియో నగరం వెళ్లారు. అడవిలోనుండి తరచు ఒక క్రూర తోడేలు నగరంలోకి జొరబడి చిన్నపిల్లల్ని, గొర్రెలు, మేకలు వంటి జంతువుల్ని చంపి తింటూ హాని తల పెడుతూందని ఫ్రాన్సిసుగారు అక్కడి ప్రజలద్వారా తెలుసుకున్నారు.

ఫ్రాన్సిసుగారు అడవికి వెళ్లి "తోడేలు సోదరా ! నీవు ఇక పై మాంసాహారం ముట్టరాదు. నీ క్రూరత్వం కాదుగాని నీ ఆకలి వలన అట్లుచేస్తున్నావు. కాని ఇకపై శాకాహారమే భుజింపుము" అని ఆజ్ఞాపించారు. ఆ క్రూర తోడేలు సాధువై కుక్కలా మారిపోయింది. ప్రజలు అందించే భోజనం మాత్రమే తింటూ అందరితో కలివిడిగా తిరగసాగింది. వృద్ధాప్యంలో అది మరణింపగా ప్రజలు దానినెంతో గౌరవంతో ఖననంచేసి ఫ్రాన్సిసుగారి గొప్ప తనాన్ని పొగిడారు.

తన జీవితాన్ని చూసి కొందమంది ఆయన  సహోదరులుగా, అనుచరులుగా చేరారు. 1209లో 3వ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మరక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకు, భిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని ఇచ్చారు. క్రీ||శ|| 1219 కల్లా ఫ్రాన్సిస్ గారి అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈనాడు ప్రపంచమంతటా వారు సేవలను అందిస్తున్నారు.

 ఫ్రాన్సిస్‌ చాలా పేద జీవితాన్ని జీవించాడు. ఒక్కోసారి భోజనంలో బూడిద కలుపుకొని తినేవాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు ముళ్ళపొదల్లో పడుకొనేవాడు. తన సహోదరుల పట్ల శ్రద్ధగా ఉండేవాడు.

 ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవాడు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమను, గౌరవాన్ని పెంచుకున్నారు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీ, సహోదరులుగా పిలిచాడు. ప్రకృతి పట్ల, అతనికున్న ప్రేమ వలన, ఈ తరము వారు కూడా ప్రకృతి పట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు ప్రేరేపింప బడాలని ఆశిద్దాం.

14 సెప్టెంబర్‌ 1221లో ప్రార్ధన చేస్తుండగా పంచగాయాలను పొందాడు. 3 అక్టోబర్‌ 1226లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే శ్రీసభ ఫ్రాన్సిస్‌ను పునీతునిగా ప్రకటించింది.