SAINT OF THE DAY – OCTOBER 18 పునీత లూకా|ST. LUKE, EVANGELIST

 పునీత లూకా

(అపోస్తలుడు, వైద్యుడు, మూడవ సువార్తికుడు, అపోస్తలుల కార్యముల గ్రంథకర్త. కళాకారులు, గాజు పరిశ్రమ కార్మికులు, నోటరీ లేఖకులు, పెయింటర్లు, వైద్యులకు పాలక పునీతుడు 1వ శతాబ్దము) పూర్వం సిరియా రాజధాని అయిన అంతియోకు నగర నివాసి లూకా గారు. విద్యావంతులు. వృత్తిరీత్యా వారు వైద్యులు. పునీత పౌలుగారు రెండో విడత వేదవ్యాపక పర్యటనకు యూదేతర సీమలకు వెళ్లినప్పుడు తీవ్ర అస్వస్థతకు గురైనారు. అదే సమయంలో చికిత్స నిమిత్తం వారు లూకాగారిని సంప్రదించడం జరిగింది. ఆ సందర్భంలోనే విగ్రహారాధకుడును, అన్యుడైన లూకాగారికి క్రీస్తు రక్షణ్యం గూర్చి బోధించి వారిని క్రైస్తవ జీవన స్రవంతిలోనికి తీసుకు వచ్చారు. పరిశుద్ధ పౌలుగారితో పునీత లూకా గారికి సన్నిహిత సంబంధం ఏర్పడింది.

భక్త పౌలుగారు తెస్సలోనిక, ఏతెన్సు, కొరింతు ప్రాంతాలలో సువార్తా ప్రచారం చేసిన మూడు సంవత్సరాల కాలంలో పునీత లూకాగారు ఫిలిప్పీ ప్రాంతంలో సువిశేషాన్ని అందించారు. తర్వాత పాలస్తీనాలోని యెరూషలేముకు పునీత పౌలు గారితో తిరిగి వచ్చారు. అపోస్తలుడైన పౌలుగారు కైసరియా (సెజారియా) వద్ద  ఖైదీగా బంధింపబడినప్పుడు లూకాగారే తరచూ సందర్శించారు. ఆ కాలంలోనే లూకాగారు వ్రాసిన సువార్తనే పునీతులైన జెరోము, జాన్ క్రిస్సోంగార్లు పౌలుగారి సువార్త అని పేరు పెట్టారు. పునీత పౌలుగారి ప్రభావం, వెలుగు తమపై పడినట్లు లూకాగారు చెప్పుకున్నారు. పౌలుగారి ప్రబోధాల్ని, సత్యోపదేశాన్ని లూకాగారు గొప్ప విశ్వాసంతో వ్రాసి, వ్యాఖ్యానించారు.

మొదటి సువార్త లేఖకులైన పునీత మత్తయిగారు ఏసుక్రీస్తు వారి మాతృభాషయైన అరమాయిక్ భాషలో లిఖించిన శుభవార్త అప్పటికే విస్తుృత ఉపయోగంలో ఉంది. లూకాగారు తమకు తాముగా సువార్తను రచిస్తున్నప్పుడు రెండవ సువార్తికుడైన పునీత మార్కుగారి సువార్తగ్రంథాన్ని తమ ముందు ఉంచుకున్నట్లు తెలుస్తుంది. క్రైస్తవ స్వచ్చందత, సమత, మమత, పేదరిక నియమం, ప్రాయశ్చిత్తం, ఆనందం గురించి లూకాగారి సువార్త నొక్కి చెబుతుంది, గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాల్ని మేరీమాతకు అందించడం, ఎలిశబేతమ్మను దర్శించడం, క్రీస్తు జననం, ప్రభువు బాల్య జీవితం వర్ణనను కండ్లకు కట్టినట్లు అందించారు. ఏసుక్రీస్తువారి జీవితాన్ని, సందేశాన్ని వ్రాయడానికి ముందు లూకాగారు చాలామంది ప్రత్యక్ష సాక్షుల్ని కలసి వివిధ విషయాల్ని సేకరించడానికి చాలా శ్రమ పడినారన్నది యదార్ధం. ముఖ్యంగా తల్లి మరియాంబగారి నుండి పలు వాస్తవాలు సేకరించడం వల్ల ఈ శుభవార్తకు “మరియమాత సువార్త”నికూడ చెప్పడం కద్దు.


పునీత లూకాగారు స్వతహాగా విద్యావంతుడు, మంచి గ్రహింపు, భావవ్యక్తీకరణ శక్తి కలిగి ఉండటాన ప్రామాణిక గ్రీకు భాషలో తమ రచనను కొనసాగించారు. సంస్కృతిపరంగా లూకాగారిది గ్రీకు నేపథ్యమే. గ్రీకు ప్రజలకోసమని తమ సువార్త రచనచేశారు. గ్రీకులకు అర్దంకావు లేక అక్కర లేదనుకున్న యూదుల చట్టాలు, ఆచారాలకు సంబంధించిన అంశాలను విడిచి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే వారికాలంలో సంభవించిన సంఘటనలు, చరిత్ర ప్రభావం వీరి రచనలో కనిపిస్తుంది. దేవునిలో నమ్మకముంచిన వారి అందరికి దేవుని కృప, క్షమాపణ తప్పక లభిస్తుందని నొక్కి చెప్పారు. పవిత్రాత్మశక్తి వీరిని బలంగా వాడుకుంది.

వారు వ్రాసిన సువార్తలో మూడు విభాగాలు అగుపిస్తాయి.

1. గలిలీ ప్రాంతలో ఏసుబోధనా పరిచర్య (లూ. 3:1, 9:56),

2. యెరూషలేముకు ప్రయాణయాత్ర (లూ. 9:57, 18:17),

3. యెరూషలేము పవిత్ర స్థలంకు చేరుట మరియు శ్రమలు (లూ. 18:18:23) ముఖ్యంగా “మంచి సమరీయుడు, పశ్చాత్తాప్తుడైన పాపి” సామెతలు పునీత లూకాగారి సువార్తలోనే గోచరమవుతాయి.

భక్త పౌలుగారు రెండేండ్లపాటు రోమునగర కారాగారంలో బంధింపబడినప్పుడు పునీత లూకాగారు వారిని సందర్శించటం జరిగింది. ఆనాటి రోము ప్రపంచానికే రాజధాని వంటి ప్రాధాన్యతను సంతరించుకుని ఉంది. పునీత లూకాగారు ఈ రోములోను చుట్టుప్రక్కల బోధిస్తున్న పేతురుగారిని మార్కుగారిని కలసి మాట్లాడి వారి ఆశీర్వాదములు పొందారు. అదే కాలంలో అపోస్తలుల కార్యాల్ని శ్రీసభ చరిత్రగా లూకాగారే అద్భుతంగా వ్రాశారు. ఇది లూకాగారి సువార్తకు పొడిగింపు రచనగా భావించాలి. అపోస్తులు ద్వారా తాము తెలుసుకున్న క్రీస్తుగూర్చి విషయాలను లూకాగారు వ్రాసిన పత్రాలు యెరూషలేములోను, కైసరియాలోనుగల ప్రసిద్ధ పురాతన దేవాలయాలలో భద్రపరచబడి ఉన్నాయి. వారు వ్రాసిన సువార్తలను వారే క్రీ||శ|| 70లో కడసారిగా మెరుగులు దిద్దినట్లు చెప్పబడింది. పునీత పౌలుగారు వేదసాక్షిగా గతించిన పిమ్మట లూకాగారు దాల్మాతియా వెళ్లి ఉండవచ్చని చరిత్రకారుల భావన. బహుశవారు గ్రీసుదేశంలో క్రీస్తు విశ్వాసంకోసం హతసాక్షిగా అసువులు బాసి ఉంటారని తెలుస్తుంది. కళాకారులు, గాజు పరిశ్రమ కార్మికులు, నోటరీ లేఖకులు, పెయింటర్లు ముఖ్యంగా వైద్యులకు పునీత లూకాగారిని పాలక పునీతునిగా శ్రీసభ ఏర్పరచింది. లూకా అంటే వెలుగు జ్యో తి, ప్రకాశం అని అర్థం.