పునీత బర్తలోమయి (24 ఆగష్టు)

 పునీత బర్తలోమయి (24 ఆగష్టు)

బర్తలోమయి పన్నిద్దరు శిష్యులలో ఒకరు. తండ్రి పేరు తోల్మయు. అపోస్తలుల పేర్లలో మాత్రమే పేర్కొనబడ్డారు. కొంతమంది బైబులు పండితులు, బర్తలోమయిని నతనయేలుతో పోల్చుతారు. గలలీయలోని 'కానా'వాసి. అపొస్తలుడు అనగా 'పంపబడినవాడు' అని అర్ధము. క్రీస్తు మరణం, ఉత్తానం, మోక్షారోహణం, పెంతకోస్తు తరువాత అపొస్తలులు నలుమూలలకు వెళ్లి సువార్తను ప్రకటించారు. సువార్తకై వేదసాక్షి మరణాన్ని పొందారు.

అపొస్తలుల పేర్ల పట్టికలో బర్తలోమయి పేరు ఆరవదిగాని (మ 10:1-4; మా 3:13-19; లూకా 6:12-16), ఏడవదిగాని (అ.కా. 1:13) చూడవచ్చు. యోహాను సువార్తలో వీరి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అయితే, యోహాను సువార్తలో ప్రస్తావించబడిన నతనయేలును (యో 1:45-56) బర్తలోమయిగా పరిగణిస్తారు. సారూప్య (సినాప్టిక్) సువార్తలలో (మత్తయి, మార్కు, లూకా) ఫిలిప్పు-బర్తలోమయి వార్లను జంటగా ప్రస్తావించ బడినది. యోహాను సువార్తలో, నతనయేలు మెస్సియాను కనుగొనుటకు ఫిలిప్పు కారకుడు అవుతాడు. కనుక, యోహాను సువార్తలో, బర్తలోమయి పేరులేకపోవడం, ఫిలిప్పు, నతనయేలు పిలుపుకు కారకుడు అవడంచేత, నతనయేలునే, బర్తలోమయిగా బైబులు పండితులు పరిగణిస్తారు. నతనయేలు ప్రస్తావన యేసు పునరుత్తానము తరువాత కూడా యున్నది (యో 21:2).

సారూప్య సువార్తలలో -బర్తలోమయి మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే, యోహాను సువార్తలో నతనయేలు యేసుతో సంభాషించడాన్ని చూడవచ్చు. యేసు పేతురు, అంద్రేయ, ఫిలిప్పులను వెంటబెట్టుకొని గలిలీయలోని కానా వెళ్ళెను. కానా చేరుకున్నాక, ఫిలిప్పు తన ఆప్తస్నేహితుడైన నతనయేలును కనుగొని యేసువద్దకు తీసుకొని పోయెను (యో 1:43-46). ఫిలిప్పు యేసుతో తన అనుభవాన్ని, తన పిలుపు గురించి, నతనయేలుతో పంచుకున్నప్పుడు, తనకున్న సందేశములను నేరుగా యేసుతోనే నివృత్తి చేసుకోవాలని తలంచాడు. ఫిలిప్పు అలాగే, "వచ్చి చూడుము" అని నతనయేలును ప్రోత్సహించాడు.

నతనయేలు తన వద్దకు వచ్చుటచూచి, అతనినిగూర్చి యేసు, “ఇదిగో! కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు” (1:47) అని పలికాడు. “మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు?” అని నతనయేలు అడుగగా యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని” అని సమాధాన మిచ్చాడు. (1:48). అందుకు నతనయేలు, మొదటగా, "నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా?" అని సంకోచించిన బర్తలోమయి [నతనయేలు], యేసుప్రభువును కనుగొనిన తరువాత, “బోధకుడా! నీవు దేవుని కుమారుడవు. యిస్రాయేలు రాజువు” అని పలికాడు. (1:49). నతనయేలు యేసును గూర్చి పలికిన రెండు బిరుదులూ "దేవుని కుమారుడు" మరియు "ఇశ్రాయేలు రాజు", యోహాను సువార్త మొదటి అధ్యాయములో యేసు గూర్చిన ఏడు బిరుదులూ ఇక్కడ పరిపూర్తియై, సంపూర్ణతను సంతరించుకున్నాయి (యో 1:29, 38, 41, 45, 49, 51). అందుకు “నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందు వలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటె గొప్ప కార్యములను నీవు చూడగలవు” అని యేసు చెప్పాడు (1:50). అటులనే ఉత్థాన క్రీస్తు నతనయేలుకు తిబేరియా సరస్సు తీరమున దర్శనమిచ్చారు (యోహాను. 21:1-14).

బర్తలోమయి ఆర్మేనియా దేశమునకు వెళ్లి సువార్తా ప్రచారం చేసి అక్కడే శ్రమలనుభవించి వేదసాక్షి మరణాన్ని పొందారు. ఆర్మేనియాకు వెళుతూ మార్గమధ్యలో లికోనియా (టర్కీ)లో బోధనలు చేసారు. అలాగే ముఖ్యనగరాలైన దెర్బే, లిస్త్రా, ఇకోనియాలలో కూడా క్రీ.శ. 46-48 మధ్యన యూదులకు, అన్యులకు సువార్తా ప్రచారం చేసారు. ఒక స్థానిక అధికారి క్రైస్తవ మతం స్వీకరించగా, ఉగ్రుడైన ఆ దేశ రాజు బర్తలోమయికి మరణ దండన విధించాడు. బ్రతికి యుండగానే, ఆయన చర్మమును ఒలిచి, చిత్రహింసలకు గురిచేశారు. అలా హతసాక్షి మరణాన్ని పొందాడు. వారు ధన్య మరణం పొందిన చోట ఒక గొప్ప దేవాలయం నిర్మించబడి, 19 వ శతాబ్దం వరకు విరాజిల్లినది. ఆ తరువాత అక్కడి క్రైస్తవులు వేదహింసలకు గురైనారు.

రోమునగర సమీపములోని తిబెర్ నదిలోని ఒక దీవి మీద నిర్మించబడిన దేవాలయములో గత పదవ శతాబ్దం నుండి బర్తలోమయి పవిత్ర అవశేషాలు భద్రపరచబడ్డాయి. వీరిని శ్రీసభ ఆర్మేనియా దేశ పాలక పునీతులుగా ప్రకటించినది.

Fr. Praveen Gopu's Homilies and Reflections

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer