నూతన పునీతులు

నూతన పునీతులు  

 ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రార్థనల సందర్భముగా పరిశుద్ధ లియో XIV  పాపు గారు "పియర్ జార్జియో ఫ్రాస్సాటి" మరియు "కార్లో అకుటిస్‌"లను పునీతులు (Saints)గా  ప్రకటించారు. ఈ సందర్భముగా ఇద్దరు యువ ఇటాలియన్లకు  నివాళులర్పించారు.

ఎనభై వేలకు పైగా విశ్వాసులను ఉద్దేశించి పరిశుద్ధ లియో XIV  పాపు గారు  మాట్లాడుతూ, ఈ ఇద్దరు యువ సామాన్య కతోలికులు మనకందరికి ఆదర్శమని అన్నారు. “సిలువను మోసి నన్ను వెంబడింపనివాడు నా శిష్యుడు కాలేడు” (లూకా 14:27) బైబిల్ వాక్యాన్ని  గుర్తు చేస్తూ ముఖ్యంగా యువత ధైర్యంగా దేవుని శిష్యరికాన్ని స్వీకరించమని ఆయన ఆహ్వానించాడు. 

సువార్త పఠనంలో భాగంగా "యేసు దేవుని ప్రణాళిక గురించి మనతో మాట్లాడుతున్నాడు, దానికి మనం హృదయపూర్వకంగా కట్టుబడి ఉండాలి" అని పరిశుద్ధ లియో XIV  పాపు గారు అన్నారు. యువకులు తరచుగా తమ జీవితాల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు మరియు కష్టమైన ఎంపికలు చేసుకోవలసి ఉంటుంది అని అన్నారు.

చరిత్రలో చాలా మంది పునీతులు ఇలాంటి ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేవుని వైపు తిరిగి ,  అయన మార్గంలో పయనించారు  మరియు వారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు "అవును" అని దేవునికి సమర్పించుకున్నారు అని పరిశుద్ధ లియో XIV  పాపు గారు అన్నారు. ఈసందర్భముగా పునీత అగస్టీన్ గారిని గుర్తు చేసుకున్నారు. 

పునీత పియర్ గియోర్గో ఫ్రాస్సాటి 

20 వ శతాబ్దం ప్రారంభంలో ఇటాలియన్ యువకుడైన పునీత పియర్ జార్జియో ఫ్రాస్సాటి (Pier Giorgo Frassati) గారి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ , కాథలిక్ సంఘాలలో ఆయన పాల్గొనడం మరియు పేదలకు అయన చేసిన సేవను వివరిస్తూ, నేడు కూడా "పియర్ జార్జియో జీవితం సామాన్యుల ఆధ్యాత్మికతకు ఒక దీపస్తంభం" అని పరిశుద్ధ లియో XIV  పాపు గారు అన్నారు.

పునీత కార్లో అకుటిస్

2006లో 15 సంవత్సరాల వయసులో మరణించిన పునీత కార్లో అకుటిస్(Carlo Acutis), యూకారిస్ట్‌ను తన జీవితంలో ప్రధానమైనదిగా ఉంచుకుని, తన కంప్యూటర్ నైపుణ్యాలను ఉపయోగించి "యూకారిస్టిక్ అద్భుతాల" పై వెబ్‌సైట్‌ను రూపొందించాడు.    

ఈ ఇద్దరు పునీతులు అసాధారణమైన విజయాల ద్వారా కాకుండా సాధారణ విశ్వసనీయత ద్వారా పవిత్రతను సాధించారని పరిశుద్ధ లియో XIV  పాపు గారు చెప్పారు. జూబ్లీ సంవత్సరంలో మిగిలిన సమయాన్ని దేవుని కొరకు ఎదురుచూస్తూ, విశ్వాసులను కొత్త పునీతుల నుండి ప్రేరణ పొందాలని పరిశుద్ధ లియో XIV  పాపు గారు  కోరారు. 

ఇద్దరు యువకులను పరిశుద్ధ లియో XIV  పాపు గారు సెయింట్లుగా ప్రకటించడంతో సెప్టెంబర్ 7న సెయింట్ పీటర్స్ స్క్వేర్లో  ఆనందం వెల్లివిరిసింది. 

Article and Design By M Kranthi Swaroop