మొదలైన గుణదల మాత శత వసంత వేడుకలు - 2024

Gunadala Matha Shrine
Gunadala Matha Shrine

మొదలైన గుణదల మాత శత వసంత వేడుకలు - 2024

విజయవాడ మేత్రాసనం, గుణదల మాత పుణ్యక్షేత్రం నూరు వసంతాల మహోత్సవ వేడుకలు జనవరి 31 తేదీన విజయవాడ  పీఠాధిపతులు మహా పూజ్య శ్రీ తెలగతోటి జోసెఫ్  రాజారావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడినది.  

జనవరి 31 బుధవారం 2024 మ.2.30 ని॥లకు పునీత పౌలు గారి కతీడ్రల్ (మేత్రాసన ప్రధాన దేవాలయము) నుండి గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్రం వరకు "గుణదల లూర్దుమాత స్వరూపముతో మహా ఊరేగింపు జరిగింది. అనంతరం మహా పూజ్య శ్రీ తెలగతోటి జోసెఫ్  రాజారావు గారి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన గురువుల అతిథి గృహ ఆశీర్వదించి    పి.ఐ.యం.ఇ. (PIME) మిషనరీ గురువులకు అంకితం చేసారు. గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర వ్యవస్థాపకుల స్మృతివనం  ప్రారంభించారు.  

సా. 5.00గం||లకు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారిచే పతాక ఆవిష్కరణం గావించి నవదిన ప్రార్థనలు ప్రారంభించారు. గుణదలమాత ప్రధాన దేవాలయం నుండి గుణదల మాత కొండమీద గల గృహ వరకు పలువురు గురువులు మరియు విశ్వాసులు జపమాల ధ్యానం, క్రొవ్వొత్తులతో దివ్యసత్ప్రసాదపు ఊరేగింపు నిర్వహించారు.

నవదిన ప్రార్థనలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 8 వరకు ప్రతి సాయంత్రం 5.30 గం||లకు పుణ్యక్షేత్ర దేవాలయము నుండి కొండ మధ్యలో ఉన్న గుణదల లూర్దుమాత గుహ వరకు జపమాల ధ్యానం, క్రొవ్వొత్తులతో దివ్యసత్ప్రసాదపు ఊరేగింపు, దివ్యబలి పూజ సమర్పణం జరుగును.

మేత్రాసన వికర్ జనరల్, మోన్సిన్యోర్ గురుశ్రీ మేశపాం గాబ్రియేలు గారు ఇతర గురువులతో కలసి పవిత్ర దివ్య పూజబలి ని సమర్పించారు. గురుశ్రీ మేశపాం గాబ్రియేలు గారు  "పవిత్ర కన్య మరియ - ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి" అనే ధ్యానాంశం పై ప్రసంగించారు.
ఫిబ్రవరి 01, 2024 న గురువారం విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు  గురుశ్రీ  పసుపులేటి యుగల్ కుమార్ గారు ఇతర గురువులతో కలసి పవిత్ర దివ్య పూజబలి ని సమర్పించనున్నారు. "పవిత్ర కన్య మరియ - దేవునితో మానవాళి"  అనే ధ్యానాంశం పై ప్రసంగించనున్నారు.

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer