ఫాదర్ స్టాన్ స్వామి వారసత్వాన్ని సజీవంగా ఉంచుతాం - స్టాన్ స్వామి యూత్ అసోసియేషన్

ఫాదర్ స్టాన్ స్వామి వారసత్వాన్ని సజీవంగా ఉంచుతాం - స్టాన్ స్వామి యూత్ అసోసియేషన్
దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామంలోని ప్రజలు జెస్యూట్ గురువు "గురుశ్రీ స్టాన్ స్వామి (Fr.Stan Swamy ) గారి వారసత్వాన్ని సజీవంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు.
పేదల పట్ల ఆయనకున్న నిబద్ధత, అణగారిన వారికి సేవ చేయడం, ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు గాను అయన పై దేశద్రోహం, తీవ్రవాద ఆరోపణలు మోపబడి జాతీయ దర్యాప్తు సంస్థ చే అరెస్టు చేయబడి, మూడు సంవత్సరాల క్రితం అయన ఖైదీగా మరణించారు.
గురుశ్రీ స్టాన్ స్వామి గారి స్వగ్రామమైన తమిళనాడు రాష్ట్రంలోని విరగలూరులో యువకులు తమ పని ద్వారా గురుశ్రీ స్టాన్ స్వామి గారి స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు "స్టాన్ స్వామి యూత్ అసోసియేషన్" ను ఏర్పాటు చేశారు.
దివంగత గురుశ్రీ స్టాన్ స్వామి గారి మూడవ వర్ధంతి సందర్భంగా జూన్ 6న తిరుచిరాపల్లి జిల్లాలోని విరగలూరు గ్రామంలోని " అవర్ లేడీ ఆఫ్ సారోస్" దేవాలయంలో జరిగిన స్మారక కార్యక్రమానికి పీఠాధిపతులు ,గురువులు ,ప్రజలతో పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్ షెర్లిన్ కూడా హాజరయ్యారు.
"గురుశ్రీ స్టాన్ స్వామి గారు తన జీవితమంతా అణగారిన మరియు స్వరం లేనివారి స్వరంగా (voice of the voiceless) వారికి సేవ చేయడానికి అంకితం చేసినందున అతని వారసత్వాన్ని సజీవంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాము" అని దివంగత గురుశ్రీ స్టాన్ స్వామి గారి మేనకోడలు ఎస్ షెర్లిన్ అన్నారు. ప్రజలు స్పూర్తి కోసం దివంగత గురుశ్రీ స్టాన్ స్వామి గారి నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు మహా పూజ్య జీవానందం అమలనాథన్ గారు అణగారిన ప్రజలకు ఆదర్శప్రాయమైన దివంగత గురుశ్రీ స్టాన్ స్వామి గారిని కొనియాడారు .స్మారక కార్యక్రమంలో పీఠాధిపతి మాట్లాడుతూ, “మన ప్రభువు యేసుక్రీస్తు బోధనల నిజమైన వెలుగులో తండ్రి స్వామి తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు.
స్మారక కార్యక్రమంలో - "హిడెన్ ట్రూత్ మరియు డినైడ్ జస్టిస్" అనే ద్విభాషా (ఇంగ్లీషు మరియు తమిళం) పుస్తకం కూడా విడుదల చేయబడింది. ఈ కార్యక్రమంలో గురుశ్రీ స్టాన్ స్వామి దర్శనం కోసం ఒక ఎద్దును దాని యజమానులు తీసుకొచ్చారు. దక్షిణ భారత రాష్ట్రంలో ఎద్దులకు ఎంతో గౌరవం ఉంది.
8 అక్టోబర్ 2020న, 2018 భీమా కోరేగావ్ హింసాకాండలో గురుశ్రీ స్టాన్ స్వామి గారి పాత్ర ఉందని మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) తో సంబంధం ఉన్నందుకు గురుశ్రీ స్టాన్ స్వామిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసి అభియోగాలు మోపింది .
గురుశ్రీ స్టాన్ స్వామి గారు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు అని, పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థించారు కానీ బెయిల్ తిరస్కరించబడింది. ట్రయల్ కోర్టు మరియు హైకోర్టు, రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం అతని ఆరోగ్యం క్షీణించినప్పటికీ బెయిల్‌పై విడుదల చేయడానికి నిరాకరించింది. జైలులో ఉన్నప్పుడు, అతని ఆరోగ్యం క్షీణించింది మరియు 84 సంవత్సరాల వయస్సులో అండర్ ట్రయల్ ఖైదీగా పశ్చిమ మహారాష్ట్రలోని ముంబైలోని ఒక ఆసుపత్రిలో జూలై 5, 2021న మరణించారు.
గురుశ్రీ స్టాన్ స్వామి గారు 1937 ఏప్రిల్ 26న భారతదేశంలోని తమిళనాడులోని ప్రస్తుత తిరుచిరాపల్లి జిల్లాలోని విరగలూరు అనే గ్రామంలో జన్మించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer