పునీత తోమా - “భారతదేశ అపోస్తలుడు” (జులై 3)

పునీత తోమా - “భారతదేశ అపోస్తలుడు” (జులై 3)
యేసు క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టువాడై ఉండెను. ఈయన తోమా దిదుమగా పిలువబడేవాడు. తోమా అను మాటకు అరామిక్ భాషలో కవలలు అని అర్థము.
యూదయా సీమలోని బెతానియాలో, మరియ, మార్తమ్మల సోదరుడు, యేసు స్నేహితుడు లాజరు మరణించినపుడు, యేసును అక్కడ హింసించే అవకాశం ఉన్నందున, యూదయాకు వెళ్ళుటకు శిష్యులు భయపడగా, తోమా, “మనము కూడా వెళ్లి ఆయనతో పాటు చనిపోవుదము” అని తోడి శిష్యులతో ధైర్యముగా అన్నారు (యోహాను. 11:16). యేసును వెంబడించినప్పుడు మరణము సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలెను అనే వాంఛ తోమా మాటలలో కనిస్తుంది.
కడరా భోజన సమయములో సత్యమును తెలుసుకోవడానికి తోమా, “ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమెట్లు ఎరుగుదుము?” (యోహాను. 14:5) అని యేసును ప్రశ్నించినపుడు, అందుకు యేసు, “నేనే మార్గము, సత్యము, జీవము” (14:6) అని చెప్పారు.
సిలువ మరణం తర్వాత పునరుత్తానుడైన ప్రభువు శిష్యుల ముందు ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. తర్వాత తోమా వచ్చినప్పుడు ఈ పునరుత్థాన వార్తను విని, అతను విశ్వసించలేదు. “నేనాయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను” అని తన సందేహమును ఖండితముగా చెప్పెను.
8 దినములు అయిన తర్వాత శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్య నిలిచి తోమానే పిలిచెను.ఆ చేతులలోని గురుతులను చూడగానే తోమా విశ్వాసియై ప్రభువు పాదాల యొద్ద “నా ప్రభువా, నా దేవా” అని మోకరిల్లిపోయాడు. “అవిశ్వాసివి కాక, విశ్వాసివై ఉండుము” (యోహాను. 20:27) అని తోమాతో అన్నప్పుడు, “నా ప్రభూ! నా దేవా!” (20:28) అని తన విశ్వాసాన్ని ప్రకటించారు.
మొదటిగా, (బహుశా, 52లో), తోమా భారతదేశములోని (కేరళ) మలబారు తీరప్రాంతములో ప్రభువు సువార్తను ప్రకటించి క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు.సముద్ర మార్గాన ‘గురువాయూరు’ సమీపమున ‘పాలయూరు’ రేవుకు చేరుకొని, అక్కడ నాలుగు (బహుశా బ్రాహ్మణ) కుటుంబాలకు జ్ఞానస్నాన మిచ్చాడు. వారికి క్రైస్తవ సిద్ధాంతాలను, ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను నేర్పించాడు. బహుశా, భారతావనిలో వీరే తొలి క్రైస్తవులు.భారతదేశములో క్రీస్తు సువార్తను తొలిసారిగా ప్రకటించిన అపోస్తలుడు తోమా.
మద్రాసు నడిబొడ్డు నుండి 10 కి.మీ. దూరానున్న సైదాపేట వద్ద చిన్నమలై కొండ ఉన్నది. తోమా సువార్త సేవకు ఈ కొండ కేంద్ర స్థానమై ఉన్నది. వేలాది మందికి పగలంతా వాక్య పరిచర్య చేసి, ప్రొద్దుపోయాక ఈ చిన్న గుహలోకి వెళ్లి ప్రార్ధనలో గడిపేవాడు. ఆ గుహ యిప్పటికి అలానే ఉన్నది.
తోమా వాక్యము వినడానికి వచ్చే వేలాది మందికి దప్పిక తీర్చే నిమిత్తం చేతి కర్రతో కొండను తట్టి యిచట నీటి జలను సృష్టించినాడు.అక్కడ  స్థానికులు కొంతమంది ఆయనపై కన్నెర్ర జేశారు. అదును చూసుకొని, ఒకరోజు  ‘కొండ’పై ప్రార్ధన చేసుకుంటుండగా, ఆయనపై దాడిచేసి, ఈటెతో పొడిచి చంపివేశారు. ఆయన 3 జూలై 72లో వేదసాక్షి మరణాన్ని పొందారు. మైలాపూరులో కొండపై (St. Thomas Mount) ఆయన నిర్మించిన దేవాలయములోనే భూస్థాపితం చేసారు. అక్కడ తోమా అద్భుత సిలువను ఆరాధిస్తారు. వీరి జ్ఞాపకార్ధం ఇప్పుడు అక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించబడింది.
ప్రస్తుతం తోమా వెముకలలోని ఒక చిన్న అవశేషం మాత్రమే ఈ దేవాలయములో ఉన్నది. క్రీ.శ. 394 లో తోమాగారి ఎముకలు ఎడాస పట్టణమునకును, తర్వాత ఇటలీ దేశమందున్న ఒర్తోనా’లోని పునీత తోమాసు వారి పెద్ద దేవాలయములో భద్రపరచబడినవి. ఎదేమైనప్పటికిని, తోమావారి కపాలము గ్రీసు ద్వీపమైన ‘పత్మోసు’ నందు అపోస్తలుడైన పునీత యోహాను మఠంలో ఉన్నదని ఒక నమ్మకం.  
తోమా “భారతదేశ అపోస్తలుడు” అని ఆరవ పాల్ పోపుగారు (Pope Paul VI) 1972లో ప్రకటించారు.

- Fr. Praveen Gopu's Homilies and Reflections

Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer