మాస్కో దాడి తర్వాత ప్రార్థనలు చేయమని కోరిన రష్యా అగ్రపీఠాధిపతి

రష్యా అగ్రపీఠాధిపతి

మాస్కో దాడి తర్వాత ప్రార్థనలు చేయమని కోరిన రష్యా అగ్రపీఠాధిపతి

శుక్రవారం సాయంత్రం మాస్కో దాడుల అనంతరం 130 మందికి పైగా మరణించారు. బాధితుల కోసం ప్రార్థన చేయాలని అగ్రపీఠాధిపతి మహా పూజ్య పావెల్ పెజ్జీ రష్యన్‌లకు పిలుపునిచ్చారు.

ఒక సందేశంలో, ఆయన  "ఇప్పటికీ ప్రమాదంలో ఉన్న వారందరి కోసం, చనిపోయిన వారికి శాంతి కోసం, గాయపడిన వారికి సహాయం మరియు వైద్యం కోసం మరియు వారికి సహాయం చేయడానికి పిలువబడే వారందరికీ ధైర్యం మ రియు సహనం కోసం" ప్రార్థనను అభ్యర్థించారు.

రష్యాలోని క్రాస్నోగోర్స్క్‌లోని ప్రదర్శన హాల్‌లో జరిగిన దాడిలో కనీసం 133 మంది మరణించారు.

సోవియట్ కాలం నాటి రాక్ బ్యాండ్ అయిన పిక్నిక్ ప్రదర్శనను ప్రేక్షకులు చూడబోతున్న సమయంలో నేరస్థులు,  ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపారు.

ISIL అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ఈ దాడికి బాధ్యత వహించింది.

రష్యా అధికారులు ప్రదర్శన హాల్‌లో దాడికి సంబంధించిన 10 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

దాడికి కొన్ని రోజుల ముందు, మాస్కోలో సమావేశాలపై ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ నివేదికల తర్వాత మాస్కోలోని యుఎస్ ఎంబసీ భద్రతా హెచ్చరికను జారీ చేసింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు శనివారం టెలివిజన్ ప్రసంగంలో దాడిని "అనాగరిక ఉగ్రవాద చర్య" అని అన్నారు.

దాడి చేసిన వారిని శిక్షిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.

2017లో బాల్టిక్ సముద్రంలో రష్యాలోని ఓడరేవు నగరమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కూడా బాంబు పేలి 15 మంది మరణించారు. ఈ దాడికి ఇస్లామిక్ తీవ్రవాదులతో సంబంధం ఉంది.

అగ్రపీఠాధిపతి పెజ్జీ దాడికి గురైన బాధితులకు మరియు బంధువులకు తన "ప్రగాఢ సానుభూతిని" తెలియజేశారు.

“దయచేసి నిరుత్సాహపడకండి మరియు మీరు ఉన్న చోట క్రీస్తు ప్రేమపూర్వక సన్నిధిగా ఉండండి; ఈ చీకటి కాలంలో నిరీక్షణకు సాక్షిగా ఉండండి" అని ఆయన అన్నారు. "మీ వ్యక్తిగత మరియు ప్రజా భద్రత కోసం తగిన జాగ్రత్తలు మరియు విచక్షణతో వ్యవహరించాలని కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను." అని ఆయన కోరారు.