పోప్ ఫ్రాన్సిస్ మృతికి భారత ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ సంతాపం

కతోలికుల విశ్వకాపరి పోప్ ఫ్రాన్సిస్ మరణం వార్త పట్ల తాను తీవ్ర దుఃఖానికి గురయ్యానని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఈ విచారకర సమయంలో విశ్వ కతోలికులకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు.
పోప్ ఫ్రాన్సిస్ సేవలను, ఆయనలోని గొప్ప గుణాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్మరించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో పోప్ ఫ్రాన్సిస్ కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా ఎప్పటికీ నిలిచిపోతారని మోదీ అన్నారు.
చిన్నతనం నుంచే ఏసుక్రీస్తు ఆశయాలకు అనుగుణంగా జీవించేందుకు తనను తాను అంకితం చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు ఆయన ఎనలేని సేవ చేశారని, కష్టాల్లో ఉన్నవారికి ఆశాకిరణంగా నిలిచారని ప్రధాని కొనియాడారు.
తాను పోప్ ఫ్రాన్సిస్‌తో జరిపిన సమావేశాలను ఎంతో అభిమానంతో గుర్తుంచుకుంటానని ప్రధాని మోదీ తెలిపారు.
సమగ్రమైన అభివృద్ధి పట్ల పోప్‌కు ఉన్న నిబద్ధత తనను ఎంతగానో ఆకట్టుకుందని, స్ఫూర్తినిచ్చిందని వివరించారు.
భారత ప్రజల పట్ల పోప్ ఫ్రాన్సిస్ చూపిన ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని మోదీ పేర్కొన్నారు.పోప్ ఫ్రాన్సిస్ ఆత్మ భగవంతుని చెంత శాశ్వతమైన శాంతిని పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ తన సందేశంలో తెలిపారు.