గణతంత్ర దినోత్సవం నాడు ఏడుగురు క్రైస్తవులు అరెస్టు

గణతంత్ర దినోత్సవం నాడు ఏడుగురు క్రైస్తవులు అరెస్టు
బజరంగ్ దళ్ సభ్యుల దాడుల నేపథ్యంలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఏడుగురు క్రైస్తవులను అరెస్టు చేశారు. మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన రెండు వేర్వేరు కేసుల్లో ఈ అరెస్టులు జరిగాయి. రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్టం కింద వారిపై అభియోగాలు మోపారు. క్రైస్తవులు ఈ వాదనలను క్రైస్తవ వ్యతిరేక ప్రచారంగా తీవ్రంగా తోసిపుచ్చారు.
రాయ్‌పూర్ సమీపంలోని మోవా అనే పట్టణంలో ఈ దాడులు జరిగాయి. ఆదివారం ప్రార్థనల తర్వాత క్రైస్తవులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా బజరంగ్ దళ్ సభ్యులు క్రైస్తవులపై మతమార్పిడి చేస్తున్నారని దాడి చేసారు అని ఛత్తీస్‌గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ జనవరి 27న యుసిఎ న్యూస్‌తో అన్నారు.
కొంతమంది క్రైస్తవులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారని, ఒకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
అలానే బలరాంపూర్ జిల్లాలోని సరుత్ అనే గ్రామంలో మతమార్పిడి ఆరోపణలతో ఒక పాస్టర్ నివాసం పై దాడి జరిగింది. పోలీసులు ఒక పాస్టర్ మరియు ముగ్గురు సహచరులను అరెస్టు చేశారు. పాస్టర్ నివాసంపై జరిగిన దాడిలో, పోలీసులు బైబిళ్లు మరియు ప్రచార కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.
భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మత మార్పిడికి కఠినమైన శిక్షలు విధించేందుకు రాష్ట్ర బిజెపి ప్రభుత్వం కొత్త మత మార్పిడి నిరోధక చట్టాన్ని ప్రతిపాదించింది. అధికార దుర్వినియోగం, బలవంతం, అనుచిత ప్రవర్తన , ప్రేరేపించడం, మోసం లేదా వివాహం ద్వారా మతమార్పిడులను ఇది నేరంగా పరిగణిస్తుంది.
న్యూఢిల్లీకి చెందిన క్రైస్తవ సంస్థ, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (UCF), గత సంవత్సరం రాష్ట్రంలో క్రైస్తవులపై 165 హింస సంఘటనలను జరిగాయి అని నివేదించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని 30 మిలియన్ల జనాభాలో క్రైస్తవులు 2 శాతం కంటే తక్కువ మంది ఉన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer