అన్ని సమాచార మాధ్యమాలు కలిసి దైవరాజ్య వ్యాప్తికి కృషి చెయ్యాలి - మహా పూజ్య పొలిమెర జయరావు

మహా పూజ్య పొలిమెర జయరావు

అన్ని సమాచార మాధ్యమాలు కలిసి దైవరాజ్య వ్యాప్తికి కృషి చెయ్యాలి - మహా పూజ్య పొలిమెర జయరావు

తెలుగు ప్రాంతీయ సమాచార కేంద్రాల అధ్యక్షులు, ఏలూరు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠ పాలనాధికారి మహా పూజ్య పొలిమెర జయరావు గారు 06 సెప్టెంబర్ 2024 న దివ్యవాణి టివి కేంద్రంలో జరిగిన సమావేశంలో అన్ని సమాచార మాధ్యమాలు కలిసి దైవరాజ్య వ్యాప్తికి కృషి చెయ్యాలి అని అన్నారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రాంతీయ సమాచార కేంద్రమైన అమృతవాణి, తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కథోలిక టివి కేంద్రమైన దివ్యవాణి టివి మరియు సామజిక మాధ్యమాల ద్వారా సువార్తను వ్యాప్తి చేసే రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం, తెలుగు కథోలిక శ్రీసభకు మూడు ప్రధాన సమాచార సాధానాలని, ఈ మూడు కేంద్రాలు కలిసి పని చేస్తూ తెలుగు కథోలిక విశ్వాసులకు అధునాతన సమాచార మాధ్యమాల ద్వారా దైవ సందేశాన్ని పంచాలని ఆయన నొక్కి వొక్కాణించారు.  

ఈ సమావేశంలో అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్, దివ్యవాణి టివి CEO గురుశ్రీ లూర్దురాజ్ SJ , దివ్యవాణి టివి ప్రోగ్రాం డైరెక్టర్ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్, తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్ మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

రానున్న రోజులలో, అమృతవాణి, దివ్యవాణి టివి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం కలిసి చెయ్యవలసిన కార్యక్రమాలను గూర్చి కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా అధ్యక్షులు మహా పూజ్య పొలిమెర జయరావు గారు మాట్లాడుతూ, చరిత్రను చుస్తే మరియతల్లి దేవుని యొక్క మొట్ట మొదటి సమాచార సాధనంగా వాడబడ్డారని, ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలని, ఆ తల్లి మనకు కావలసిన శక్తిని దయచేస్తారని అన్నారు. 

సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ సలహాలను, సూచనలను మరియు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నేటి సామజిక మాధ్యమాలలో ప్రసారం చేసే కార్యక్రమాల ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలో గురుశ్రీ రాజు అలెక్స్ గారు వివరించారు.

చివరిగా తెలుగు శ్రీసభలో మూడు ప్రధాన సమాచార సాధనాలుగా దైవవాక్య పరిచర్యలో  అమృతవాణి, దివ్యవాణి టివి మరియు రేడియో వెరితాస్ ఆసియ క్రియాశీల పాత్రను పోషించాలని అందుకు కావలసిన మార్పులు, నూతన కార్యాచరణలు అధ్యక్షులవారు సూచించి, సమావేశానికి వచ్చిన వారిని ఆశీర్వదించారు.