పునీత మదర్ థెరెసా

పునీత మదర్ థెరెసా

ఎక్కడో యుగోస్లేవియా(ప్రస్తుతం మాసిడోనియా)లో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ. తన 12  వ ఏటా ఆమె ఐర్లాండ్‌కు వెళ్లింది . అక్కడ, ఆమె సిస్టర్స్ ఆఫ్ లోరెటో సభలో  కథోలిక సన్యాసినిగా మారింది.

మదర్ థెరిసా,1931లో  కోల్‌కతలో తన సభకు చెందిన స్కూల్‌కు ఉపాధ్యాయురాలు అయ్యారు.  కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామ చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు.

కోల్‌కతాలో నివసిస్తున్న పిల్లల కోసం మదర్ థెరిసా ఒక ఓపెన్-ఎయిర్ పాఠశాలను ప్రారంభించారు.వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఆమె పని గురించి విన్నారు. సహాయం చేసేందుకు కొందరు కోల్‌కతా వచ్చారు. 1950లో, మదర్ థెరిసా తన సొంత ఆర్డర్-ది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించారు.

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పేదరికంలో మగ్గుతున్న వారిని ఆదుకోవాలని కోరింది. ఈ క్రమంలో అనాథాశ్రమాలు, నర్సింగ్‌హోమ్‌లు, హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. మదర్ థెరిసా 1960లలో కుష్టు వ్యాధి ఉన్నవారి కోసం ఒక కాలనీని కూడా ప్రారంభించింది .

జీవించిన కాలం ప్రతిరోజును దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానంగా భావించి పేదలను, రోగులను, అనాధులను, పసిపిల్లలను ఆదరించి వారికి నిజమైన ప్రేమను, దయను, సేవను అందించిన గొప్ప తల్లి, ప్రేమమూర్తి, వినయమూర్తి, సేవామూర్తి పునీత థెరెసా గారు.

‘దేవుని చేయిలో నేనొక చిన్న పెన్సిల్‌ ముక్కను. వ్రాసేవాడు ఆయనే. ఆలోచించేవాడు ఆయనే. నడిపించేవాడు ఆయనే. నేను చేయాల్సిందంతా ఒక చిన్న పెన్సిల్‌ ముక్కగా ఉండటమే’’ అని పునీత థెరెసా గారు స్పష్టంగా చెప్పి యున్నారు.

1962లో భారత ప్రభుత్వం మదర్ థెరిసా భారత ప్రజలకు ఆమె చేసిన సేవలకు గానూ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని ప్రదానం చేసింది. ఆమెకు మొదటి పోప్ జాన్ XXIII శాంతి బహుమతిని ప్రదానం చేశారు. 1979లో ఆమె తన మానవతా పనికి నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది మరియు మరుసటి సంవత్సరం భారత ప్రభుత్వం ఆమెకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసింది .1997లో, మదర్ థెరిసా  అనారోగ్యంతో మరణించారు. 2016లో ఆమెకు పునీత పట్టాన్ని ఇచ్చి గౌరవించారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer