పునీత బప్తిస్మ యోహాను జయంతి ఉత్సవం

పునీత బప్తిస్మ యోహాను జయంతి ఉత్సవం

యోహాను జననం లోకరక్షకుని రాకకు సంకేతం. ఆయన చేసిన తొలి శబ్దం క్రీస్తు జననానికి దారి చూపింది. ఆయన బోధనలు, హెచ్చరికలు ప్రజలలో స్పూర్తిని రగిలించి  ప్రేరణ కలిగించాయి. ఎంతోమందిని దైవ బాటలోకి నడిపించాయి. మన తల్లి శ్రీసభ, పునీత బప్తిస్మ యోహాను జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా కొనియాడుతూ ఉంటుంది.

పునీత బప్తిస్మ యోహోనుగారు జెరుసలేము పవిత్రనగర దాపులోని అయిన్  కరీం అనే ఊళ్లో జూన్‌ 24న పుట్టారు. తండ్రి పూజారియైన జకరయా. తల్లి  ఎలిజబెత్‌. ఈమె కన్య మరియకు దగ్గరి బంధువురాలు. యూదయసీమలో కీ॥శ!! 29 వరకు యెడారుల్లో ఒక బుషిగా జీవించినట్లు చరిత్ర చెబుతోంది.యొర్దాను నదీతీరంలో ఆయన సంచరిస్తూ రాబోవు క్రీస్తు దేవునిగూర్చి ప్రవచిస్తూ “పశ్చాత్తాప్తులుకండి. దైవరాజ్యం సమీపింపబోతోంది'' అని పలికారు. ప్రజలందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.
యేసుక్రీస్తు నిజమైన వెలుగు.ఎందరో ప్రజలు ఆయన మాట విన తరలివచ్చేవారు. క్రీస్తుకు కాబోయే శిష్యులుకూడ వారి మాటలు విన్నవారే.
ఏసుప్రభువుకు జ్ఞానస్నానమిచ్చింది బప్తిస్మ యోహానుగారే, ఆ సందర్భంలోని “ఇదిగో ! దేవుని గొర్రెపిల్ల. లోకపాపాల్ని తొలగించేవారు.” అని ప్రకటించారు. యొర్దాను నది ఒడ్డు పాడవునా సంచరించి ప్రబోధించారు.

ఆ పరలోక తండ్రి  మన జీవితంలో మనకు చేసిన అద్భుత కార్యముల గూర్చి, ఒసగిన దీవెనల గూర్చి  మనముకూడా  సాక్ష్యమిద్దాం! ఈ లోకానికి ప్రభువు ఒసగిన రక్షణకు సాక్షిగా నిలబడదాం.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer