పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు)

పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు)

15 ఆగష్టున  పరిశుద్ధ కన్య మరియమ్మ మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. ఏలినవారియందు ఆనందించుచు, కన్య మరియ గౌరవార్ధము ఆమె ఉత్సవమును కొనియాడుదము. ఆమె మోక్షారోపణ సందర్భమున దేవదూతలు పరవశించి దైవ కుమారుని స్తుతించిరి.

ఈనాటి ఉత్సవ సారాంశం: 
దైవసుతుని తల్లియగు నిష్కళంక కన్య మరియమ్మను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి దేవుడు చేర్చుకొని యున్నాడు. ఈ దినము కన్యకయగు దేవమాతకు స్వర్గ ప్రవేశ వరము లభించెను. ఈవిధముగా, మరియ సత్యసభ పొందవలసియున్న పరిపూర్ణ రూపురేఖలకు సూచకముగా ఉన్నది. ఈ లోకమందు జీవిత యాత్ర గడుపు మనందరికీ నమ్మక పూరిత ఆశగాను, దుఃఖ:బాధల మధ్యన ఊరటగాను ఆమె వెలసి యున్నది. దైవ కుమారుని కనిన ఆమె శరీరము మరణానంతరము శిధిల మొందుటకు అంగీకరించలేదు. ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడి యున్నది. అందుకే, మరియ స్తుతి గీతములో చెప్పిన వాక్యాలు, అక్షరాల నేరవేర్చబడ్డాయి. "తరతరములవారు నన్ను ధన్యురాలని పిలుతురు. ఎందుకన, సర్వేశ్వరుడు నాయందు ఘనకార్యములను నెరవేర్చెను." దేవుడు మరియ జీవితములో చేసిన ఒక మహోన్నత కార్యము, ఆమెను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి చేర్చుకొనుట.

ఈ ఉత్సవం, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏవిధముగా తోడ్పడుచున్నది? యేసు చెప్పినట్లుగా, "తండ్రి గృహమున అనేక నివాసములు కలవు" (యోహాను. 14:2). మానవుని నివాసము దేవుడు. అదే నిత్య నివాసము, నిత్య జీవితము, నిత్య సంతోషము. మరియ ఆ నివాసమునకు ఆత్మ శరీరములతో కొనిపోబడి యున్నది. అంత మాత్రమున మరియమ్మ మనకు దూరము కాలేదు. దేవునిలో ఐక్యమైన మరియ దేవుని సానిధ్యాన్ని పంచుకొనియున్నది. దైవ సాన్నిధ్యం మన దరిలోనే ఉన్నది. దేవున్ని ఆశ్రయించే ప్రతీ వారి దరికి ఆయన వచ్చును. దేవునిలో మనకొరకు నివాసమున్నట్లే, మనలో కూడా దేవుని కొరకు నివాసమున్నది. మరియ దేవుని సాన్నిధ్యాన్ని హృదయములో పదిల పరచుకొన్నది. అలాగే, మనలో దైవ సాన్నిధ్యమున్నదంటే, మనలో దేవునికి నివాసము ఉన్నట్లే గదా! ఈ సాన్నిధ్యం, విశ్వాసమున ప్రదర్శింపబడు చున్నది. విశ్వాసమున మన జీవిత ద్వారాలను తెరచిన దేవుడు మనలో కొలువు దీరును. దేవుని కొలువుతో మన జీవితం ధన్యమవుతుంది.

మరియమ్మ మనకు ఎన్నో విధాలుగా ఆదర్శప్రాయులు. ఈరోజు ప్రత్యేకముగా అమ్మ మరియ ప్రార్ధన సహాయాన్ని వేడుకొందాం. ఆమె ప్రార్ధన ఫలితమున మన విశ్వాసం అధికమధికమగునుగాక. దేవుడు మనకు ఇచ్చిన సమయములో గొప్ప నమ్మకముతో జీవింతుముగాక. మనముకూడా పునరుత్థాన మహిమను సాధించగలుగుదుముగాక.

ఈరోజు మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుచున్నాము. మన దేశాభివృద్ది కొరకు ప్రార్ధన చేద్దాం. స్వాతంత్రం, సమానత్వం, అభివృద్ది ప్రతీ భారతీయుడు చవిచూడాలని ఆశిద్దాం. మన స్వాతంత్రం కొరకు పాటుబడి మరణించిన వారిని గుర్తుకు చేసుకొంటూ, వారు చూపించిన సన్మార్గములో మనం నడవడానికి కావలసిన శక్తిని ఇవ్వుమని దేవున్ని ప్రార్ధిద్దాం.
- Fr. Praveen Gopu's Homilies and Reflections

Design : M kranthi swaroop