యేసు ప్రభువుని జ్ఞానస్నాన పండుగ

తండ్రి దేవుడు తన పవిత్రశక్తిని ఆయన మీద కుమ్మరించారు

ఈరోజు  కతోలిక శ్రీసభ యేసు ప్రభువుని జ్ఞానస్నాన పండుగను జరుపుకొనుచున్నాము.

ఆ రోజులలో యూదాయు దేశపు ఎడారిలో బాప్తిస్మమిచ్చే యోహాను దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టిన  తరువాత  యేసు ప్రభువారు  యోహానును కలవడానికి యొర్దాను నది దగ్గరికి వచ్చారు.  అప్పుడు యేసుప్రభువునకు దాదాపు 30 ఏళ్ళ వయస్సు.
యోహాను తనకు బాప్తిస్మం ఇవ్వమని యేసుప్రభువు వారు అడగగా,  యోహాను, “నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాల్సిన వాణ్ణి, అలాంటిది నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చావా?” అంటూ యేసుప్రభువు వారికీ అడ్డు చెప్పాడు.

యేసు దేవుని కుమారుడని యోహానుకు తెలుసు. మరియమాత గర్భవతి అయిన ఎలిజబెత్ ను  కలవడానికి  వెళ్లినప్పుడు, ఎలిజబెత్ గర్భములోని  ఉన్న యోహాను సంతోషంతో గంతులు వేశాడని మనము చదివి ఉన్నాము.

అప్పుడు యేసు ప్రభువారు “ఇప్పటికి ఇలా జరగనివ్వు , మనం ఈ విధంగా దేవుడు కోరే వాటన్నిటినీ చేయడం సరైనది.” అని అన్నారు. అప్పుడు  యోహాను అంగీకరించి యేసు ప్రభు వారికీ బప్తిస్మము ఇచ్చెను. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు, అదిగో! ఆకాశము తెరువ బడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగి వచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు, ఆకాశము నుండి ఒక దివ్యవాణి ‘ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను’ అని వినిపించెను” (మత్త. 3:16-17).

యేసుప్రభు వారు  బాప్తిస్మం తీసుకున్నప్పుడు తండ్రి దేవుడు  తన పవిత్రశక్తిని ఆయన మీద కుమ్మరించాడు. యేసు ప్రభువారి యందు ఎటువంటి  జన్మపాపము, ఏ ఇతర పాపము లేకున్నను, జ్ఞానస్నానమును స్వీకరించి మనకు సుమాతృకగా వున్నారు. మన  పాపలనుండి  విడుదల చేయడానికి  జ్ఞానస్నానముమనకి ఎంత అవసరమో  యేసు ప్రభు వారు తెలియజేసారు.

యేసు ప్రభు వారు  అప్పటివరకు తన తండ్రికి సహాయకంగా వడ్రంగి పని చేశారు. అయితే  పరలోక తండ్రి దేని కోసమైతే తనను భూమ్మీదికి పంపించారో , ఆ కార్యని  మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది. తన తండ్రి ఇష్టాన్ని చేయడానికి తనను తాను అర్పించుకుంటు యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారు. క్రీస్తు బప్తిస్మం లోకరక్షణోద్యమానికి శ్రీకారం.
యేసు ప్రభు వారు అప్పటినుండి దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తూ, పాపులైన మనందరి  కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. క్రీస్తు బప్తిస్మపండుగను కొనియాడుచున్న మనందరం , మన జ్ఞానస్నాన ప్రమాణాలను నూత్నీకరించుదాం. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా  దేవుని మార్గంలో జీవించుదాం.