కేరళలో భూ వివాదాన్ని పరిష్కరించేందుకు కతోలిక, ముస్లిం నేతలు సమావేశమయ్యారు
కేరళలో భూ వివాదాన్ని పరిష్కరించేందుకు కతోలిక, ముస్లిం నేతలు సమావేశమయ్యారు
కేరళ రాష్ట్రంలోని కతోలిక పీఠాధిపతులు మరియు ముస్లిం నాయకులు వివాదంలో ఉన్న భూమిపై ముస్లిం స్వచ్ఛంద సంస్థ యొక్క దావాను పరిష్కరించే మార్గాలను చర్చించారు. ఎర్నాకులం జిల్లాలోని సముద్రతీర గ్రామమైన మునంబమ్ ప్రాంతంలో నివసిస్తున్న 600 కతోలిక కుటుంబాలు ఖాళీ చేయాల్సి ఉంది.
"బాధిత కుటుంబాలకు అగ్రశ్రేణి ముస్లిం నాయకులు సంఘీభావం తెలిపినందుకు మేము సంతోషిస్తున్నాము" అని కేరళ రీజియన్ లాటిన్ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మహా పూజ్య వర్గీస్ చక్కలకల్ గారు అన్నారు.
కేరళలోని మొత్తం 12 లాటిన్ రైట్ డియోసెస్లకు చెందిన పీఠాధిపతులు నవంబర్ 18న కొచ్చిలోని వెరాపోలీ అగ్రపీఠంలోని ప్రధాన కార్యాలయంలో ముస్లిం నాయకులతో సమావేశమయ్యారు. కేరళలోని కమ్యూనిటీకి చెందిన లౌకిక రాజకీయ పార్టీ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నాయకులు పాల్గొని, ముస్లింలకు ప్రాతినిధ్యం వహించారు.
నవంబరు 20న UCA న్యూస్‌తో మహా పూజ్య వర్గీస్ చక్కలకల్ గారు మాట్లాడుతూ, ముస్లిం నాయకులు “సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించుకోవడానికి అంగీకరించారు" అని తెలిపారు.
మునంబమ్లోని దాదాపు 615 కుటుంబాలు ముస్లిం ధార్మిక సంస్థలకు విరాళంగా ఇచ్చిన భూమిని పాలించే అధికారం కలిగిన ముస్లిం సంస్థ అయిన వక్ఫ్ బోర్డు వాదనను నిరసిస్తున్నారు.
కొనుగోలు సమయంలో భూమిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయలేదని, 2008లో ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఏకపక్షంగా గుర్తించిందని నిరసన నాయకులు అంటున్నారు.
ఆ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల క్రితం గ్రామస్థులు సేల్ డీడ్ల ద్వారా కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ భూమిని 19వ శతాబ్దంలో ఒక ముస్లిం స్వచ్ఛంద సంస్థలకు బహుమతిగా ఇచ్చారని వక్ఫ్ బోర్డు పేర్కొంది.
IUML కేరళ అధ్యక్షుడు సాదిక్ అలీ షిహాబ్ తంగల్ మీడియాతో మాట్లాడుతూ "ప్రభుత్వం ఈ సమస్యలో వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవాలి." అని కోరారు. భూ యాజమాన్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ముస్లింలు, కతోలికులు మరియు హిందువులతో సహా అన్ని వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
కతోలిక పీఠాధిపతులందరి బహిరంగ మద్దతుతో భూమిపై తమ హక్కులను తిరిగి పొందడానికి ఆ ప్రాంతం వారు బహిరంగ నిరసనను ప్రారంభించారు. క్రమంగా, ఇతర క్రైస్తవ వర్గాలు మరియు హిందూ సంస్థలు ఈ ఉద్యమంలో చేరాయి.
“ప్రముఖ ముస్లిం నాయకులు సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం మంచి సంకేతం. మేము చాలా సానుకూలంగా ఉన్నాము మరియు శాశ్వత పరిష్కారాన్ని ఆశిస్తున్నాము, ”అని వెరాపోలీ అగ్రపీఠాధిపతి మహా పూజ్య జోసెఫ్ కలతిప్రమాబిల్ గారు అన్నారు.
అయితే, రాష్ట్ర లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ప్రభుత్వం తన మౌనాన్ని విడనాడి న్యాయమైన పద్ధతిలో చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.
కేరళలోని 33 మిలియన్ల జనాభాలో క్రైస్తవులు 18 శాతం, ముస్లింలు 26 శాతం, హిందువులు 54 శాతం మంది ఉన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer