కథోలిక పాఠశాలలు హిందూ సంఘాల నుండి రక్షణ కోరుతున్నాయి

కథోలిక పాఠశాలలు హిందూ సంఘాల నుండి రక్షణ కోరుతున్నాయి
ఈశాన్య అస్సాం రాష్ట్రంలో శ్రీసభ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల ప్రాంగణాల్లోని ఉన్న అన్ని మత చిహ్నాలను తొలగిస్తామని బెదిరిస్తున్నారు.
ఒక కాథోలిక పాఠశాల గోడపై బెదిరింపు పోస్టర్ అతికించబడినందున, పాఠశాల సిబ్బంది పోలీసు రక్షణను కోరారు. దాదాపు రెండు వారాల క్రితం అస్సాం రాష్ట్రంలోని క్రైస్తవ పాఠశాలలో మతపరమైన అన్ని క్రైస్తవ చిహ్నాలను తీసివేయాలని ఒక హిందూ గ్రూప్ "కుటుంబ సురక్ష పరిషత్" ఫిబ్రవరి 7న గౌహతిలో విలేకరుల సమావేశంలో కాథోలిక పాఠశాలలకు అల్టిమేటం ఇచ్చింది. కుటుంబ సురక్ష పరిషత్ అధ్యక్షుడు సత్య రంజన్ బోరా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఫిబ్రవరి 16న అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్‌లోని కార్మెల్ స్కూల్ గోడపై ఈ బెదిరింపు పోస్టర్ ను సిబ్బంది కనుగొన్నారు. దాని ప్రకారం పాఠశాలలో ఉన్న అన్ని క్రైస్తవ చిహ్నాలను తొలగించాలి అని, పాఠశాలకు ఒక వారం గడువు ఇచ్చారు.
ఈ పోస్టర్ "పాఠశాల క్యాంపస్‌లో భయాందోళనలను సృష్టించింది" అని పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రోజ్ ఫాతిమా గారు ఫిబ్రవరి 17న తన ఫిర్యాదులో పేర్కొన్నారు.శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు మేం ఎప్పుడూ కృషిచేస్తున్నాం’ అని సిస్టర్ ఫాతిమా గారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అపోస్టోలిక్ కార్మెల్ సన్యాసినులు (సిస్టర్స్) నిర్వహిస్తున్నఈ పాఠశాల ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది.ముఖ్యంగా పేద గిరిజన ప్రజలు నివసించే అస్సాంలోని మారుమూల ప్రాంతాలలో శ్రీసభ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు విద్య, వైద్య సేవలు అందిస్తూనే ఉన్నాయి.
ఫిబ్రవరి 7న, కుటుంబ సురక్ష పరిషత్ అధ్యక్షుడు సత్యరంజన్ బోరా, ఇతర హిందూ సంఘాల నాయకులతో కలిసి గౌహతి నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 15 రోజుల్లోగా పాఠశాల ఆవరణలో ఉన్న ఏసుక్రీస్తు మరియు మదర్ మేరీల ఫోటోలు, పునీతుల లేదా మతపరమైన చిహ్నాలను తొలగించడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బహిరంగంగానే హెచ్చరించారు.
ఫిబ్రవరి 19న గౌహతి అగ్రపీఠాధిపతులు జాన్ మూలచిరా గారు మాట్లాడుతూ , "మేము మా పాఠశాలలకు ఫిర్యాదులు చేయమని సలహా ఇచ్చాము అని అన్నారు. ఇటువంటి బహిరంగ బెదిరింపులను పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తానని చెప్పారు. "క్రైస్తవ చిహ్నాలను తొలగించాలనే డిమాండ్" వల్ల క్రైస్తవులు కలవరపడుతున్నారని చెప్పారు.
అస్సాంలోని 31 మిలియన్ల జనాభాలో క్రైస్తవులు 3.74 శాతం ఉన్నారు, ఇది జాతీయ సగటు 2.3 శాతం కంటే ఎక్కువ.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer