అత్యంత భక్తిశ్రద్ధలతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అంత్యక్రియలు

అత్యంత భక్తిశ్రద్ధలతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అంత్యక్రియలు
విశ్వశ్రీసభ అధినేత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అంత్యక్రియలు శనివారం నాడు వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 2.5 లక్షల మందికి పైగా విశ్వాసులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నాయకులు,అధికారులు, ప్రముఖులు హాజరై పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు.
భారత ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం ఈ అంత్యక్రియలకు హాజరైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, సహా అనేక మంది ప్రపంచ నాయకులు హాజరయ్యారు.
సెయింట్ పీటర్స్ బేసిలికా ప్రాంగణంలో అంత్యక్రియల ప్రార్థనలకు కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే నేతృత్వం వహించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో కార్డినల్స్, ఆర్చ్‌బిషప్‌లు, బిషప్‌లు, సిస్టర్స్ మరియు ఫాదర్లు పాల్గొన్నారు .
అంత్యక్రియల ప్రార్థనల అనంతరం, పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో రోమ్‌లోని 'బేసిలికా డి శాంటా మారియా మగ్గియోరే'(Santa Maria Maggiore)కు తరలించారు. పోప్ ఫ్రాన్సిస్ తన వీలునామాలో పేర్కొన్న ప్రకారం సెయింట్ మేరీ మేజర్లో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer