ఘనంగా దేవమాత మోక్షారోపణ మహోత్సవం

ఘనంగా దేవమాత మోక్షారోపణ మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, జ్ఞానాపురంలోని  పునీత పేతురు ప్రధాన దేవాలయంలో దేవమాత మోక్షారోపణ మహోత్సవాన్ని గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. విచారణ గురువులు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆగష్టు 1 న మొదలయ్యిన ఈ వేడుకలు పండుగ రోజు అనగా ఆగష్టు 15 వ తారీఖు గురువారం తో ముగిసాయి.


పండుగ మహోత్సవ మొదటి సమిష్టి కృతజ్ఞతా దివ్యబలి పూజ ఉదయం 6.30 గంటలకు  విశాఖ అతిమేత్రాసన అపోస్తిలిక పాలన ఆధికారి మరియు ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు ఇతర గురువులతో కలసి సమర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


 ఉదయం 9 గంటలకు జరిగిన  రెండవ కృతజ్ఞతా దివ్యబలి పూజ విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతి మహా పూజ్య మల్లవరపు ప్రకాశ్ గారు సమర్పించారు. మధ్యాహ్నం మూడు గంటలకు  మూడవ కృతజ్ఞతా దివ్యబలి పూజ విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దిగ్గింపూడి బాలశౌరి గారు సమర్పించారు.


సాయంత్రం 4 గంటలకు  జ్ఞానపురం పురవీధుల్లో 'దేవమాత తేరుతో  విశ్వాసులు, విచారణ ప్రజలు ప్రదక్షిణగా సాగారు.  ఈ ఊరేగింపులో వేలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు, విచారణ గురువులు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు , ఇతర గురువులు,సిస్టర్స్ పాల్గొన్నారు.  


విచారణ సహాయ విచారణ గురువులు గురుశ్రీ వినయ్, గురుశ్రీ అంథోని రాజ్ , ఆల్ ఇండియా కేథలిక్ యూనియన్ వైజాగ్ ప్రెసిడెంట్ శ్రీ 'బూర రవీంద్ర శేషుబాబు గారు , పీపీసీ అధ్యక్షుడు శ్రీ ముసురి రాజేష్, జి.శ్యామల రావు, నమ్మి మరియదాసు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఎటువంటి ఆటకం కలగకుండా చూసుకున్నారు.

అనంతరం దివ్యసత్ప్రసాద ఆరాధన జరిగింది. గురుశ్రీ కిల్లాడ పాల్ భూషణ్ గారు దైవసందేశాని ప్రజలకు అందించారు.

ఈ కార్యక్రమంలో లూర్దుమత భజన బృందానికి ప్రత్యేకత ఉంది. వీరు 15  రోజుల పాటూ  మరియమాత స్వరూప తేరు వెనుక వీధుల్లో తిరుగుతూ గీతాలను ఆలపిస్తూ విశ్వాసులను భక్తితో మార్గంలో  నడిస్తుంటారు. వీరు నేటికి సంప్రదాయ సంగీత పరికరాలైన తాళాలు, డోలక్, హార్మోనియం వంటివి ఉపయోగిస్తారు.

ప్రతి ఏటా మతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు మరియతల్లి సహాయం కోసం ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. గురుశ్రీ జాన్ ప్రకాష్ గారు పండుగకు సహకరించిన అందరికి హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియజేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer