క్రైస్తవ విశ్వాసం కారణంగా సమాన పని అవకాశాలను నిరాకరించడం దురదృష్టకరం - ఫాదర్ రాబిన్సన్ రోడ్రిగ్స్

క్రైస్తవ విశ్వాసం కారణంగా సమాన పని అవకాశాలను నిరాకరించడం దురదృష్టకరం - ఫాదర్ రాబిన్సన్ రోడ్రిగ్స్ 

తమ క్రైస్తవ విశ్వాసం కారణంగా నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని క్యాథలిక్  బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ప్రజా సంబంధాల అధికారి ఫాదర్ రాబిన్సన్ రోడ్రిగ్స్ గారు ఖండించారు. ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు

తిరుమల తిరుపతి దేవస్థానం నియమాళికి విరుద్ధంగా ఉన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. వారు  క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన టీటీడీ.. వారిపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.  సస్పెండ్ అయిన వారిలో పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్  డాక్టర్ G.అసుంత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్) బి.ఎలిజర్, బిఐఆర్‌డి హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సు ఎస్.రోజి, బిఐఆర్‌డి హాస్పిటల్‌లో గ్రేడ్-1 ఫార్మసిస్ట్ ఎం.ప్రేమావతి ఉన్నారు.

ఈ నెల ప్రారంభంలో మరొక అధికారిని సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం తన స్వస్థలంలో చర్చికి క్రమం తప్పకుండా హాజరవుతున్నారనే ఆరోపణలపై ఆయనను కూడా సస్పెండ్ చేశారు.

ఫాదర్ రాబిన్సన్ రోడ్రిగ్స్ గారు జూలై 21న UCA న్యూస్‌తో మాట్లాడుతూ "క్రైస్తవ ఉద్యోగుల  సస్పెన్షన్ "చాలా దురదృష్టకరం" మరియు విశ్వాసం కారణంగా సమాన పని అవకాశాలను నిరాకరించడాన్ని  భారతదేశ లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని అన్నారు.

ఎన్నో ఏళ్లుగా నిస్వార్థమైన సేవ చేస్తూ "క్రైస్తవులు నిర్వహించే ఆస్పత్రులు మరియు ఛారిటీలు , ఇతర  సంస్థలలో పదివేల మందికి పైగా  క్రైస్తవేతరులు పనిచేస్తున్నారు అని మరియు వారు ఎప్పుడూ ఎటువంటి వివక్షను ఎదురుకొనలేదు అని, ఆలయ అధికారుల చర్య సమర్థనీయం కాదు" అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన  పాస్టర్ అరుళ్ అరసు గారు కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ఈ సస్పెన్షన్లు రాష్ట్రంలో రాజకీయ మార్పుతో ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. 

2024లో జరిగిన చివరి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP), హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ (BJP) మరియు జనసేన పార్టీలతో జతకట్టి,  క్రైస్తవుడు అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి, అధికారంలోనికి వచ్చింది. 

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer