యాచకులు లేని నగరంగా విశాఖ

యాచకులు లేని నగరంగా విశాఖ
కుటుంబ సభ్యులు గెంటేసి ఒకరు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల కొందరు...ఇలా చాలా మంది విశాఖపట్నంలో యాచకులుగా మారారు. ఇంకొందరు అన్నీ ఉన్నా యాచించటమే వృత్తిగా మలుచుకుంటున్నారు. యాచించటాన్ని రూపుమాపేందుకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శ్రీ శంఖబ్రత బాగ్చి గారు గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు.
గురువారం రోజు నగరంలో పొలిసు సిబ్బంది మరియు "వైజాగ్ వాలంటీర్స్" సహకారంతో నగరంలో యాచిస్తున్న 243 మంది యాచకులను గుర్తించి, వారికి క్షవరం, స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇచ్చి, టిఫిన్తో పాటు భోజనం కూడా అందించారు. 243 మందిలో 45 మంది బాగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారిని అప్పగించారు. మానసిక స్థితి సరిగా లేని 9 మందిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రికి తరలించారు . మిగిలిన 189 మందిని వివిధ పునరావాస కేంద్రాలకు పంపించారు.
గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ శంఖబ్రత బాగ్చి గారు మాట్లాడారు. 'తమసోమా జ్యోతిర్గమయ' అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణమని వివరించారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, హార్బర్ సీఐ సింహాద్రి నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తిరుపతిరావు, సీఐ చప్పా ప్రసాద్(వీఆర్), నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని యాచకులకు తగిన ఆశ్రయం కల్పించి, వారిని గౌరవప్రదమైన జీవితం వైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ శంఖబ్రత బాగ్చి గారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో "వైజాగ్ వాలంటీర్స్" యువతి యువకులు పాల్గొని తమ సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
Article and Design: M. Kranthi Swaroop