కార్మెల్ మాత మహోత్సవం
కార్మెల్ మాత మహోత్సవం (జులై 16వ తేదీ )
శ్రీసభ చరిత్రలో మరియతల్లి దర్శనాలు చాలా విరివిగా కనిపిస్తుంటాయి. కానీ అన్ని దర్శనాలు అధికార పూర్వకంగా ప్రపంచానికి వెల్లడి చేసినవి కావు. ఇందులో కొన్ని మాత్రమే శ్రీసభ చేత ఆమోదించబడి ప్రజల విశ్వాస అభివృద్ధికి తోడ్పడుతున్నవి. ఇటువంటి ప్రాముఖ్యమైన మరియతల్లి దర్శనాలలో అత్యంత ప్రాముఖ్యమైన దర్శనం మరియతల్లి కార్మెల్ మాతగా పునీత సైమన్ స్టోక్ గారికి ఇచ్చిన దర్శనం. సైమన్ స్టోక్ గారు 1165వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని “కెంట్” పట్టణంలో జన్మించారు. భక్తి విశ్వాసాలతో పెరిగారు. యెరుషలేము నగరమునకు తీర్థ యాత్రలకు వెళ్లి అచట గల కార్మెలైట్ సభ జీవిత విధానాల పట్ల ఆకర్షితులై క్రీ.శ. 1240 లో వీరు ఈ సభలో చేరారు.
1247వ సంవత్సరంలో వీరు కార్మెలైట్ మఠానికి అధిపతి అయ్యారు. ఆ రోజుల్లో తురుష్కులు కార్మెల్ మఠసభ గురువులను బెదిరించి తమ మఠ నిలయాలు నుండి వారిని తరిమి కొట్టారు. భయాందోళనతో మఠ అధిపతి అయినటువంటి సైమన్ స్టోక్ గారు సైతం మఠాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. సైమన్ స్టోక్ గారు ఈ భయాందోళనల మధ్య తమ సొంత గ్రామం అయినటువంటి “కెంట్”కు తిరిగి వచ్చారు. ఎంతో విశ్వాసముతో వినయ విధేయతలతో భయాందోళనతో చెల్లాచెదురైన తమ గురువులను తమ తమ మఠాలకు చేర్చాలని వేద హింసలు ఆగిపోయి తురుష్కులు మారుమనస్సు పొందాలని మరియతల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నారు. 1251 జూలై 16వ తేదీన మరియమాత కార్మెల్ మాతగా సైమన్ గారికి దర్శనమిచ్చి వస్త్రముతో తయారు చేసిన చిన్న గోధుమ రంగు ఉత్తరీయాన్ని దయ చేసారు. ఈ ఉత్తరీయాన్ని ధరించి విశ్వాస విధేయతలతో ప్రార్థించే వారికి అనేక రకమైన మేలులు కలుగుతాయని ముఖ్యంగా మరణ సమయంలో తప్పక రక్షించ బడతారు అని మరియ తల్లి సైమన్ గారికి వాగ్దానం చేశారు. ఆ క్షణం నుండి మరియమాత ఉత్తరీయమును ధరించి ప్రార్థించే వారందరికీ సంరక్షణ దైవ దీవెనలు లభిస్తూ వచ్చాయి. ఉత్తరీయాన్ని ధరించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది. సైమన్ గారు ప్రార్ధించిన ప్రకారం వారు తిరిగి తమ తమ మఠములకు చేరుకుని తమ సేవలను కొనసాగించారు. కార్మెల్ మాత భక్తి క్రమక్రమంగా పెరిగింది 1380వ సంవత్సరంలో మూడవ “హనోరియసు” పోపు గారు కార్మెల్ మఠ స్థాపనను ధృవీకరించటం ద్వారా కార్మెల్ మాత పండుగ మొదట ప్రారంభమైనది. కొంతమంది కతోలిక సన్యాసులు పర్వతం మీద ఒక చిన్న దేవాలయములను నిర్మించి దానిని కార్మెల్ మాతకు అంకితమిచ్చారు. 1726వ సంవత్సరంలో 13వ బెనెడిక్ట్ పోప్ గారు ఈ పండుగను రోమన్ దైవార్చనలో అధికార పూర్వకంగా విశ్వవ్యాప్తం చేశారు.
- గురుశ్రీ ప్రవీణ్ గోపు
Design : M KRANTHI SWAROOP (RVA Online Content Producer)