మార్చి 22ను ప్రార్థన మరియు ఉపవాస దినంగా పాటించాలి -సిబిసిఐ
భారతదేశంలో శాంతి మరియు సామరస్యం కొరకు మార్చి 22, 2024 న ప్రార్థన మరియు ఉపవాసం చేయాలని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) వారు కోరారు.
బెంగుళూరులో జరిగిన CBCI 36వ రెండేళ్ళ అసెంబ్లీ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం పేర్కొన్నారు.
రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు, మైనారిటీల హక్కులను ఎప్పటికీ పణంగా పెట్టరాదని CBCI హెచ్చరించింది.
హిందూ జాతీయవాదానికి తమ మద్దతును ప్రదర్శించేందుకు హిందూ ఛాందసవాదులు వీధుల్లోకి వచ్చి చర్చిలు మరియు మసీదులపై కాషాయ జెండాలను ఎగురవేసిన తర్వాత క్రైస్తవులు మరియు ముస్లింలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
2023 లో ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా క్రైస్తవులపై 687 హింసాత్మక కేసుల సంకలనాన్ని డిసెంబర్‌లో, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ (UCF) వారు ప్రచురించారు.
"న్యాయం, సమానత్వం మరియు సౌభ్రాతృత్వంపై స్థాపించబడిన భారతదేశం రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించడానికి ప్రతి రాజకీయ నాయకులు ప్రయత్నం చెయాలి" అని భారతీయ పీఠాధిపతులు విజ్ఞప్తి చేశారు.
174 మేత్రాసనాలకు చెందిన పీఠాధిపతులు పౌరులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మరియు రాజ్యాంగ విలువలను కాపాడే మరియు పేదలకు సహాయం చేసే నాయకులను ఎన్నుకోవటానికి తెలివిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
"ఎన్నికలు సమీపిస్తున్నందున, ఓటు వేయడానికి అర్హులైన క్రైస్తవులందరూ మత స్వేచ్ఛ, మానవ గౌరవం మరియు ప్రజాస్వామ్య ప్రక్రియను సమర్థించాలని గుర్తుంచుకోవాలి" అని జనవరి 31న CBCI అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ పరిశుద్ధ పోపు గారి రాయభారి మహా పూజ్య లియోపోల్డో గిరెల్లి పౌరులను కోరారు.
భారతదేశ జనాభాలో 79.8% హిందువులు, 14.2% ముస్లింలు మరియు 2.3% క్రైస్తవులు ఉన్నారు. అయితే, 230 మిలియన్ల జనాభాతో భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో, జనాభాలో కేవలం 0.18% మాత్రమే క్రైస్తవులు.