పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రత్యేక స్టాంపులను విడుదల చేసిన ఇండోనేషియా

పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారి ప్రత్యేక స్టాంపులను విడుదల చేసిన ఇండోనేషియా

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాకు రావడానికి ఒక రోజు ముందు, ఇండోనేషియా ప్రభుత్వం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి  మూడు రోజుల పర్యటనకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.

ఇండోనేషియా సమాచార మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలో  సెప్టెంబర్ 2న జకార్తాలో ఈ స్టాంపులను ప్రారంభించారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి స్టాంపుల విడుదల ఇండోనేషియాలోని కథోలికులకు  గొప్ప గౌరవం" అని జకార్తా అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య ఇగ్నేషియస్ సుహార్యో హార్డ్‌జోట్‌మోడ్జో గారు అన్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి పర్యటన సందేశం దేశమంతటా పంపిణీ చేయబడే ప్రత్యేక స్టాంపుల ద్వారా ప్రజలకు చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సెప్టెంబరు 5న గెలోరా బంగ్ కర్నో మెయిన్ స్టేడియంలో జరిగే ప్రార్థనల  సందర్భంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ ప్రత్యేక స్టాంపులను ఆశీర్వదించనున్నట్లు కమ్యూనికేషన్ మరియు సమాచార మంత్రిత్వ శాఖ నుండి శ్రీ గుణవన్ హుటగాలుంగ్ గారు తెలిపారు.

గతంలో పరిశుద్ధ పోప్ పాల్ VI  మరియు పరిశుద్ధ  పోప్ జాన్ పాల్ II గార్ల సందర్శన సందర్భముగా కూడా  ఇండోనేషియా ప్రత్యేక స్టాంపులను విడుదల చేసిందని ఇండోనేషియాలో పాపు గారి సందర్శన కమిటీ అధ్యక్షులు  ఇగ్నాసియస్ జోనన్ గారు తెలిపారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన నాలుగు దేశాల ఆసియా మరియు ఓషియానియా పర్యటనలో మొదటి గమ్యస్థానమైన ఇండోనేషియాను సెప్టెంబర్ 3 నుండి 6 వరకు సందర్శిస్తారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer