గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి డాక్టరేట్
గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి డాక్టరేట్
విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి విద్యారంగంలో పరిశోధనకు పి.హెచ్.డి. ప్రదానం చేసారు. గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారు, శ్రీ చిటికిల ఆనందరావు మాస్టర్, మాణిక్యం దంపతుల కుమారుడు.
విశాఖ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల, ఉపాధ్యాయుల భావోద్వేగ ప్రజ్ఞ, బోధనా సామర్థ్యం, బోధనాభిరుచుల మధ్యగల పరస్పర సంబంధంపై అధ్యయనం” అనే శీర్షికతో విద్యలో పరిశోధనకు గాను గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి.) పట్టా పొందారు.
ఈ పరిశోధనను ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ప్రొఫెసర్, మాజీ విద్యా విభాగాధిపతి, డీన్ మరియు ఐ.ఎ.ఎస్.ఈ. మాజీ ప్రిన్సిపాల్ ప్రొ॥ ఆర్. శివప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో విజయవంతంగా పరిశోధనలు పూర్తి చేయడంతో ఆయనకు వర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. ప్రస్తుతం కత్తిపూడి విచారణకర్తలుగా గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారు తన అమూల్యమైన సేవలను అందిస్తున్నారు.
గతంలో జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన దేవాలయం లో విచారణకర్తలుగా జ్ఞానాపుర ప్రజలను ఆధ్యాత్మిక చింతనలో నడిపించడమే కాక, సామాజిక బాధ్యతతో ఎన్నో గొప్ప పనులు చేశారు.
జ్ఞానాపురంలో గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారు మద్యం షాపులపై వ్యతిరేక చేసిన పోరాటం మరిచిపోలేనిది. ఆనాటి ఉద్యమంలో గురుశ్రీ రాజకుమార్ గారి పిలుపును మన్నించి ప్రొటస్టెంట్ సహోదరులు, వారి సంఘ విశ్వాసులూ తో పాటూ హైందవ-ముస్లిం సోదరులూ సహకరించి ఆ పోరాటాన్ని విజయవంతం చేసారు.
ఇంతే కాకుండా విశాఖ అగ్రపీఠ ప్రజలలో చైతన్యాన్ని రగిలిస్తూ జమ్ము కాశ్మీర్ కు చెందిన 'ఆసిఫా' అను చిన్నారి మీద జరిగిన లైంగిక దాడి హత్య సమయంలో, పుల్వామా అమరవీరుల సంస్మరణ సమయంలో, 'ఫాదర్ స్టాన్ లూర్ధు సామి నిర్బంధాన్ని' నిరసిస్తూ- వారి మరణానికి అశృనివాళి అర్పిస్తూ, ఢిల్లీ లో రైతుల దీక్షలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ, క్రైస్తవులపై 'మతోన్మాదుల దాడులను ఖండిస్తూ గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారు ముందుండి ఎన్నో నిరసన కార్యక్రమలు నిర్వహించారు.
సెయింట్ మేరీస్ విద్యా సంస్థలకు ప్రిన్సిపాల్ గా అనేక సేవలు అందించిన గురుశ్రీ రాజకుమార్ గారికి డాక్టరేట్ రావడంతో విశాఖ అగ్రపీఠ విశ్వాసులు ఆనందం వ్యక్తం చేశారు.
డాక్టరేట్ స్వీకరించిన సందర్భంగా గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం నుండి హృదయపూర్వక అభినందనలు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer