పునీత లొయోలా ఇగ్నేషియస్ (ఇన్యాసి)
పునీత లొయోలా ఇగ్నేషియస్ (ఇన్యాసి)
14 డిసెంబరు 1491వ సం.లో, ఉత్తర స్పెయిన్ దేశములో, ‘లొయోలా’లోని కోట భవంతిలో ఇగ్నేషియస్ జన్మించారు. బెల్ట్రాన్, మరియ అతని తల్లిదండ్రులు. తండ్రి లొయోలా కోట, ఒనాజ్ రాజ్య ప్రభువు. తల్లి కూడా ఉన్నత వంశస్థురాలు. తన ఏడవ యేటనే తల్లి మరణించినది. పదకొండుమంది సంతానములో ఇగ్నేషియస్ చివరివారు. ఇగ్నేషియస్ పెరుగుచున్న కొలది, ఎన్నో యుద్ధాలు జయించి, పేరుప్రఖ్యాతలు సంపాదించి ఆనందముగా జీవితాన్ని గడపాలని ఆశించారు.
ఒకసారి ఫ్రెంచి సైన్యం స్పెయిన్ ఉత్తర భూభాగముపై దండెత్తి ‘పాంప్లోనా’ నగరాన్ని ముట్టడించి, అక్కడి కోటను ఆక్రమించగా, ఆ కోట సంరక్షణలోనున్న ఇగ్నేషియస్ తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ గొప్ప పోరు కొనసాగించారు. ఆ యుద్ధములో ఒక తుపాకి గుండు ఇగ్నేషియస్ కుడి మోకాలు దిగువన తగిలి నేలపై కుప్పకూలి పోయారు. చికిత్సకు చాలా కాలం పట్టింది. ఈ సమయములోనే, వీరోచితుల గాధలు చదవాలని పుస్తకాలను కోరారు. అవి లభ్యం కాకపోవడముతో, ‘పునీతుల గాథలు’, ‘క్రీస్తానుకరణము’ అను పుస్తకాలు అతనికి ఇచ్చారు. అయిష్టముగా చదవడం ప్రారంభించారు. కాని, అవి చదువుచుండగా, తన అంత:రంగములోని వెలితిని గమనించారు. అతనిని ఆలోచనలను పూర్తిగా మార్చి వేసింది. “వీరంతా పునీతులు కాగలిగినప్పుడు, నేనెందుకు కాకూడదు?” అని తననుతాను ప్రశ్నించుకున్నారు. 1522లో మారుమనస్సు పొందారు.
పూర్తిగా కోలుకున్న తరువాత, ఒకరోజు మరియతల్లి దర్శనమివ్వడముతో, సెర్రాత్ కొండ దగ్గరలోని మరియ పుణ్యక్షేత్రమును సందర్శించారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, మన్రెసా’లోని దగ్గరలో కొండ గుహలో సంవత్సరంపాటు, మౌనధ్యానములో, ప్రార్ధనలో గడిపారు. ఆ సమయములోనే ‘ఆధ్యాత్మిక అభ్యాసాలు’ (Spiritual Excercises) అనే పుస్తకాన్ని రంచించారు. ఆ తరువాత ‘పవిత్ర భూమి’ని కూడా సందర్శించారు.
వీరు దేవుని సేవకు అంకితమయ్యారు. ఏడుగురు కలిసి ఒక మఠ సభగా ఏర్పడటానికి నిశ్చయించు కున్నారు. పారిస్ నగరములోని ‘మార్ట్రే’ అనే కొండపైనున్న దేవాలయమునకు వెళ్లి పేదరికం, విరక్తత్వం, విధేయత వ్రతాలను జీవిస్తామని దేవునికి వాగ్దానం చేసారు. రోము నగరమునకు వెళ్లి మూడవ పౌల్ (Paul III) పోపుగారిని కలిసి, తమ సభా నియమావళిని సమర్పించి అనుమతిని కోరారు. తప్పుడు బోధనలను ఎదుర్కోవడానికి, ఇలాంటి విద్యావంతులు శ్రీసభకు అవసరమని పోపుగారు గుర్తించారు. వారు గురువులుగా అభిషిక్తులవడానికి అనుమంతించారు. గురువుగా, తన ప్రధమ పూజాబలిని రోము నగరములోనే సమర్పించారు. 1540లో వారు “యేసు సభ”గ (Society of Jesus) గుర్తించ బడ్డారు. వారి ప్రధాన పరిచర్యలు: బోధన, పాపసంకీర్తనాలు వినడం, ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం, విద్య. 7 ఏప్రిల్ 1541లో ఇగ్నేషియస్ మొదటి ‘సుపీరియర్ జనరల్’గ ఎన్నుకోబడ్డారు.
ఈ సభ ఇటలీ దేశమంతా వ్యాపించింది. పేదలకు, రోగులకు సేవలు చేయడం, వీధులలో కతోలిక సత్యాలను అందరికి అర్ధమయ్యేలా బోధించడం, పుణ్య కార్యాలు చేయడం వంటి పరిచర్యలు చేసారు. ఆఫ్రికా, అమెరికా, భారతదేశం, జపాన్ వంటి ఇతర దేశాలలో కూడా తమ పరిచర్యలను ప్రారంభించారు.
లొయోలా ఇగ్నేషియస్ 31 జూలై 1556లో మరణించారు. యేసు సభ స్థాపించబడి 16 సం.లు ముగిసాయి. అప్పటికి వెయ్యి మంది యేసు సభ సభ్యులు వంద ఆశ్రమాలలో సేవలను అందిస్తున్నారు.
ఇగ్నేషియస్ వారికి యువతపట్ల ప్రేమానురాగాలు అమితముగా ఉండేవి. వారి కొరకు చాలా పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. మన భారత దేశమునకు వచ్చిన యేసు సభ సభ్యులు కూడా ఎన్నో విద్యాసంస్థలను స్థాపించారు.
27 జూలై 1609లో పదిహేనవ గ్రెగోరి (Gregory XV) పోపు ఇగ్నేషియస్ వారిని పునీతునిగా ప్రకటించారు.
- Fr. Praveen Gopu's Homilies and Reflections
Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer