పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు )

పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణము (15 ఆగష్టు )

 ఈరోజు పరిశుద్ధ కన్య మరియమ్మ మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. ఏలినవారియందు ఆనందించుచు, కన్య మరియ గౌరవార్ధము ఆమె ఉత్సవమును కొనియాడుదము. ఆమె మోక్షారోపణ సందర్భమున దేవదూతలు పరవశించి దైవ కుమారుని స్తుతించిరి.
 దైవసుతుని తల్లియగు నిష్కళంక కన్య మరియమ్మను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి దేవుడు చేర్చుకొని యున్నాడు. ఈ దినము కన్యకయగు దేవమాతకు స్వర్గ ప్రవేశ వరము లభించెను. ఈవిధముగా, మరియ సత్యసభ పొందవలసియున్న పరిపూర్ణ రూపురేఖలకు సూచకముగా ఉన్నది. ఈ లోకమందు జీవిత యాత్ర గడుపు మనందరికీ నమ్మక పూరిత ఆశగాను, దుఃఖ:బాధల మధ్యన ఊరటగాను ఆమె వెలసి యున్నది. దైవ కుమారుని కనిన ఆమె శరీరము మరణానంతరము శిధిల మొందుటకు అంగీకరించలేదు. ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడి యున్నది. అందుకే, మరియ స్తుతి గీతములో చెప్పిన వాక్యాలు, అక్షరాల నేరవేర్చబడ్డాయి. "తరతరములవారు నన్ను ధన్యురాలని పిలుతురు. ఎందుకన, సర్వేశ్వరుడు నాయందు ఘనకార్యములను నెరవేర్చెను." దేవుడు మరియ జీవితములో చేసిన ఒక మహోన్నత కార్యము, ఆమెను ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి చేర్చుకొనుట. - గురుశ్రీ ప్రవీణ్ గోపు