ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనం ఉంటున్న భూమి, భూమి మీద వాతావరణం గురించి తెలుసుకోవడం, రాబోయే తరాలకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (World Earth Day) ముఖ్య ఉద్దేశ్యం.1970 ఏప్రిల్‌ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం జరిగింది.

1969 జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంటా బార్బరలో చమురు విస్పోటనం (Santa Barbara Oil Spill) జరిగింది. దీనివల్ల జరిగిన విపరీతమైన నష్టానికి వ్యతిరేకంగా విద్యార్థి యుద్ధ వ్యతిరేక ఉద్యమం (Student Anti-war Movement) మొదలైంది.
ఈ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson) వాతావరణం లో జరిగే మార్పులను వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన వంతుగా ఏమి చెయ్యాలో అందరికీ తెలియజెప్పడానికి సంవత్సరంలో ఒకరోజుని కేటాయించాలని అనుకున్నాడు. వెంటనే తన మిత్రులకు, ప్రజలకూ ఒక వార్తాపత్రిక ద్వారా ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించాడు.

గేలార్డ్ నెల్సన్ 22 ఏప్రిల్ 1970 న దేశవ్యాప్తంగా పర్యావరణ బోధనను నిర్వహించాలనే ఆలోచనను ప్రతిపాదించాడు. ఇతను జాతీయ సమన్వయకర్తగా డెనిస్ హేస్ (Denis Hayes) అనే యువ కార్యకర్తను నియమించుకున్నాడు. నెల్సన్ మరియు హేస్ ఈ సంఘటనకు Earth Day అని పేరు మార్చారు.

ఈ భూమి మన అందరిది, ఇందులో మనతో పాటు సమస్త ప్రాణకోటి జీవించేందుకు అర్హత కలిగి ఉంది. కానీ, నేడు అభివృద్ధి పేరుతో పచ్చని అడవులు నశించిపోతున్నాయి, అరుదైన జీవజాతులు కనుమరుగై పోతున్నాయి, పక్షులు అంతరించిపోతున్నాయి. మనం తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల... అన్ని  కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి.  మొత్తం మీద జీవసమతుల్యత దెబ్బతింటోంది.  పచ్చదనంతో కలకలలాడాల్సిన భూతల్లి.. ప్రకృతి అందాలను కోల్పోయి మౌన రోదనతో కన్నీరు కార్చుతోంది.

 ప్లాస్టిక్ వాడకం, నేలపైన చెత్తచెదారలు, నదులు కలుషితం చేయడం, అడవులు నరికివేయడం వంటివి అన్నీ మనిషి తెలిసి చేస్తున్న తప్పిదాలే. ఈరోజు ఉష్నోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయంటే, నీరు లేక జనం అల్లాడుతున్నారంటే అందుకు కారణం స్వయంకృతపరాధమే.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer