అస్సాం వరద బాధితులకు అండగా కారిటాస్ ఇండియా

అస్సాం వరద బాధితులకు అండగా కారిటాస్ ఇండియా

దేశంలోని శ్రీసభ  యొక్క సామాజిక సేవా విభాగం అయిన కారిటాస్ ఇండియా , ఈశాన్య ప్రాంతంలోని అస్సాం రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలలో రెస్క్యూ మరియు సహాయ పనుల కోసం సిద్ధమైంది.

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది.  సెంట్రల్ అస్సాంలోని నాగోన్ మరియు దర్రాంగ్ మరియు బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమైనట్లు నివేదికలు తెలిపాయి.

‘‘మా బృందం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, మేము మా NGO నెట్‌వర్క్ సహాయంతో పరిస్థితి యొక్క తీవ్రతను అంచనా వేస్తున్నాము, ”అని ఈశాన్య భారతదేశంలో కారిటాస్ ఇండియా జోనల్ ప్రోగ్రామ్ లీడ్ జోనాస్ లక్రా జూలై 4న UCA న్యూస్‌తో అన్నారు.

దేశంలో ఇటువంటి అత్యవసర విపత్తుల పరిస్థితులు సంభవించినపుడు  కారిటాస్ ఇండియా మానవతా సహాయం అందించిందని, ఎంతోమందికి సహాయం చేసిందని,  ప్రస్తుతం వరద బాధిత ప్రజలకు తమవంతు సహాయాన్ని అందిస్తున్నామని, వరద పరిస్థితి భయంకరంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే కారిటాస్ బృందం నిరంతర సహాయ పనిని  ప్రారంభిస్తుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు, సహాయక శిబిరాల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. ఇప్పటివరకు 25,744 మంది నిర్వాసితుల కోసం మొత్తం 181 సహాయ శిబిరాలు మరియు 334 సహాయ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

జూలై 4న స్థానిక మీడియా ప్రకారం 46 మంది మరణించారని, అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 29 జిల్లాల్లోని 2,800 గ్రామాలలో 1.6 మిలియన్ల మంది ప్రజలు వరదలుకు  ప్రభావితమయ్యారు.

 


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer