ఇండోనేషియా: దేశంలో నెలకొన్న నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మతాంతర సంభాషణకు పిలుపునిచ్చిన కతోలిక వేదిక

“ఇండోనేషియాను ప్రేమించడం: వివేకాన్ని పెంపొందిస్తూ, గణతంత్ర దేశంలో మర్యాదపూర్వక ప్రవర్తనను పరిరక్షించడం” అనే ఇతివృత్తంతో అక్టోబర్ 24న ఇండోనేషియాలోని జకార్తాలో నిర్వహించిన జాతీయ సింపోజియంలో 100 మందికి పైగా పాల్గొన్నారు.

ఇండోనేషియా: దేశంలో నెలకొన్న నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మతాంతర సంభాషణకు పిలుపునిచ్చిన కతోలిక వేదిక
ఇండోనేషియా కతోలిక సమాజ వేదిక (FMKI), దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, పర్యావరణ సవాళ్ల నేపథ్యంలో మతాంతర సంభాషణను బలోపేతం చేయడం, ప్రజాజీవితంలో మర్యాదపూర్వక ప్రవర్తనను పెంపొందించడం, సామాజిక ఐక్యతను బలోపేతం చేయడం కోసం అక్టోబర్ 24న జకార్తాలో సుమారు 100 మంది పాల్గొన్న జాతీయ సింపోజియంను నిర్వహించింది.

సెంట్రల్ జకార్తాలోని మెంటెంగ్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా పీఠాధిపతుల సమాఖ్య కేంద్రంలో ఈ సింపోజియం జరిగింది. FMKI జాతీయ కార్యాచరణ సమావేశంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కతోలిక సమాజ ప్రతినిధులతో పాటు మత, ప్రభుత్వ, పౌర సమాజ రంగాలకు చెందిన వక్తలు పాల్గొన్నారు. “ఇండోనేషియాను ప్రేమించడం: వివేకాన్ని పెంపొందిస్తూ, గణతంత్ర దేశంలో మర్యాదపూర్వక ప్రవర్తనను పరిరక్షించడం” అనే అంశంపై వారు చర్చించారు.

జకార్తా అగ్రపీఠాధిపతి కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో ముఖ్యోపన్యాసం చేస్తూ, ఇండోనేషియా స్వాతంత్ర్య పోరాటంలోనూ, దేశ నిర్మాణంలోనూ తొలి కతోలిక నాయకులు అందించిన సేవలను గుర్తుచేశారు.

ఇండోనేషియా ప్రజలకు అండగా నిలవాలన్న శ్రీసభ నిబద్ధతకు ఉదాహరణలుగా, పీఠాధిపతి ఆల్బర్టస్ సోగియాప్రానటా వాటికన్‌కు చేసిన విజ్ఞప్తిని, సెంట్రల్ జావాలో సేవలందించిన యేసు సమాజ గురువు ఫ్రాన్స్ వాన్ లిత్ వారసత్వాన్ని ఆయన ప్రస్తావించారు.

“తొలి కతోలిక నాయకులు చూపిన ఈ ప్రేమ ఇండోనేషియాలోని కతోలిక శ్రీసభకు అమూల్యమైన వారసత్వంగా మారింది. ప్రస్తుత తరం కూడా ఈ వారసత్వాన్ని కొనసాగించాలి” అని కార్డినల్ సుహార్యో అన్నారు.

ఇండోనేషియా పీఠాధిపతుల సమాఖ్య సామాన్య విశ్వాసుల అపోస్తలిక సేవల కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ యోహానెస్ కుర్నియాంటో జెహరుట్, సమాఖ్య 2026 సంవత్సరానికి సంబంధించిన సేవాపరమైన సందేశాన్ని సమర్పించారు. మానవీయ సంఘీభావాన్ని బలోపేతం చేయాలని, ప్రజాజీవితంలో మర్యాదపూర్వక ప్రవర్తనను ప్రోత్సహించాలని ఈ సందేశం శ్రీసభకు పిలుపునిస్తోంది.

దేశం ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభం, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యలు, ఆర్థిక అసమానతలు, పర్యావరణ క్షీణత, సామాజిక విభేదాలు, డిజిటల్ యుగం తెస్తున్న ఒత్తిళ్లను ఆయన వివరించారు. మతాంతర, సంస్కృతుల మధ్య సంభాషణలను విస్తరించడం, రక్షణ చర్యలను బలోపేతం చేయడం, కతోలిక పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజాసేవా సంస్థల సేవలను మెరుగుపరచడం వంటి చర్యలను ఆయన సూచించారు.

ఇండోనేషియా అధ్యక్షుని ఇంధన రంగ ప్రత్యేక సలహాదారు పుర్నోమో యుస్గియాంటోరో, 2045 నాటికి సంపన్న దేశంగా ఎదగాలన్న ఇండోనేషియా లక్ష్యాన్ని గురించి మాట్లాడారు. విద్యను బలోపేతం చేయడానికి, జాతీయ గుర్తింపును పెంపొందించడానికి, ప్రజల్లో అక్షరాస్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం, విద్యారంగం, పౌర సమాజం, మీడియా, వ్యాపార రంగాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన నొక్కిచెప్పారు.

ఇండోనేషియాలోని ముస్లిం సంస్థ అయిన ముహమ్మదీయా కేంద్ర నాయకత్వ అధ్యక్షుడు స్యాఫిక్ ఎ. ముఘ్నీ, దేశం నైతిక విలువల లోటును ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా సహనాన్ని, న్యాయాన్ని ప్రోత్సహించాలని మత నాయకులకు పిలుపునిచ్చారు.

ఇండోనేషియా గుస్దూరియన్ నెట్‌వర్క్ జాతీయ డైరెక్టర్ అలిస్సా వాహిద్, పర్యావరణ సమస్యలు, తగిన నాయకత్వం లేకపోవడం, అసహనం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రజల జీవన సంక్షేమాన్ని మెరుగుపరచేందుకు వివేకంతో కూడిన, నిరంతర చర్యలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

వివిధ మత, వృత్తిపరమైన వర్గాలతో సహకరిస్తూ, దేశ జీవితంలో కతోలికులు చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ సింపోజియం ముగిసింది.

1998లో స్థాపించబడిన FMKI, సామాజిక, రాజకీయ అంశాలపై ఇండోనేషియా కతోలికులు కలిసి పనిచేయడానికి ఒక వేదికగా సేవలందిస్తోంది. దేశంలోని పంచశీల జాతీయ తత్వాన్ని, కతోలిక సామాజిక బోధనను ఆధారంగా చేసుకుని, మానవ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఉమ్మడి మేలును ప్రోత్సహించడం ఈ వేదిక లక్ష్యం.

Telugu Survey Popup Image