ఖమ్మం మేత్రాసనంలో జాతీయ నిరసన దినము

ఖమ్మం మేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం కొత్త కలెక్టరేట్ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు 

దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య డాక్టర్ సగిలి ప్రకాష్ గారు ప్రభుత్వాన్ని కోరారు. 

పీఠాధిపతులవారు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ దళిత క్రైస్తవుల పట్ల వివక్ష కొనసాగుతుందన్నారు. 

రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక తత్వం మత స్వేచ్ఛ లో భాగంగా దళితులు తమకు ఇష్టమైన క్రైస్తవ మతాన్ని స్వీకరించారని తెలిపారు. క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన దళితుల ఆర్థిక స్థితిలో మార్పు రాలేదని, మిగతా అన్ని మతాల దళితులు లాగానే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 

మతం పేరుతో రాజ్యాంగం ప్రసాదించిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు దళిత క్రైస్తవులకు గత 75 సంవత్సరాలుగా అందకుండా పోతున్నాయన్నారు. ప్రభుత్వం తరఫున పలు రకాల కమిషన్లు వేసినప్పటికీ వాటి వలన దళిత క్రైస్తవులకు ఎటువంటి ప్రయోజనం లభించలేదన్నారు. 

ఈ కార్యక్రమంలో మేత్రాసన ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గురుశ్రీ సెబాస్టియన్, గురుశ్రీ ఎస్ ఐసాక్, గురుశ్రీ  ఎమ్ రాజు, గురుశ్రీ కొమ్ము అంతోని, గురుశ్రీ తప్పెట్ల శౌరి, గురుశ్రీ జోజి రెడ్డి, గురుశ్రీ బత్తుల జయరాజు, సిస్టర్ సుందరి, లేటి కమిటీ బాధ్యులు యం.ప్రసాద్, కొమ్ము ప్రసాద్,, పిల్లి సుందరి, తదితరులు పాల్గొన్నారు. 

తొలుత స్థానిక జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఖమ్మం పీఠం మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కథోలికులు ర్యాలీ నిర్వహించి కొత్త కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని నిరసన ప్రార్థనతో ధర్నా నిర్వహించారు.


 

Tags