అస్సీసీలో సమావేశానికి వీడియో సందేశాన్ని పంపిన పోప్

అస్సీసీలో జరిగిన అంతర్జాతీయ శాంతి సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి పోప్ లియో వీడియో సందేశాన్ని పంపించారు 

1986 అక్టోబర్ 27న పునీత రెండవ జాన్ పాల్ ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలకు చెందిన నాయకులను ఇటలీలోని అస్సీసీకి ఆహ్వానించి, చరిత్రలో తొలిసారిగా అందరూ కలిసి శాంతి కోసం ప్రార్థించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పోప్ లియో అస్సీసీని సందర్శించాలని భావించినప్పటికీ, ఇటీవల శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడానికి వైద్యులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని సూచించారు. 

దీంతో ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినా, అక్కడ సమావేశమైన విశ్వాసులకు వీడియో సందేశం పంపించారు.

ఈ సందర్భంగా పునీత ఫ్రాన్సిస్ వలే సోదరభావంతో జీవించడం సాధ్యమేనని ఇది ప్రపంచానికి చాటిచెప్పాలని పోప్ కోరారు. 

1989 తర్వాత ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలో శాశ్వత శాంతి నెలకొంటుందని చాలామంది భావించారని, అయితే అది మత ఛాందసవాదం, గుర్తింపు ఆధారిత విభేదాలు, జాతీయవాద ప్రతిస్పందనలకు కారణమైందని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వివిధ మతాల నాయకులు పరస్పర సంభాషణ, చర్చలు, అవగాహన ద్వారా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని పోప్ పిలుపునిచ్చారు. 

హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని, దేవుని పేరుతో యుద్ధం చేయడాన్ని ఎప్పటికీ సమర్థించలేమని స్పష్టం చేస్తూ, “మతం పేరుతో పోరాడటం అంటే మతంపైనే దాడి చేయడం. పవిత్ర యుద్ధం అంటూ ఏదీ లేదు.. శాంతి మాత్రమే పవిత్రమైనది” అని పోప్ ఉద్ఘాటించారు.

చివరగా, అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదని గుర్తుచేస్తూ, ప్రపంచ శాంతి కోసం ప్రార్థనను కొనసాగించాలని పోప్ లియో తన సందేశాన్ని ముగించారు.

Telugu Survey Popup Image