నిరుపేదలలో ప్రభువును దర్శించండి - పొప్ ఫ్రాన్సిస్ గారు

నిరుపేదలలో ప్రభువును దర్శించండి -  పొప్ ఫ్రాన్సిస్ గారు

ప్రపంచ పేదల దినోత్సవాన్ని పురస్కరించుకొని "సెయింట్ పీటర్స్ బసిలికా"లో దివ్యబలిపూజలో జగద్గురువులు మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు పాల్గొని తన సందేశాన్ని ప్రజలకు అందించారు.

"మనలను ధనవంతులను చేయడానికి పేదవాడిగా మారిన యేసు ప్రభువుని జీవిత  ప్రయాణాన్ని ఈ సందర్భముగా  పోప్ ఫ్రాన్సిస్ గారు గుర్తుచేసుకున్నారు.

మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ "ఆ దేవాది దేవుడు తన ప్రియా కుమారుడు  క్రీస్తు ప్రభువును మనందరి రక్షణార్థం ఈ లోకానికి పంపించారని.  ఒక సాధారణ పేదవాడిగా జన్మించి , పేదవానిగానే జీవించారని ఆయన విశ్వాసులకు తెలియపరిచారు. పేదలను చులకన భావంతో చూసేవారు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలని" అన్నారు.

తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ  "మన దగ్గర ఉన్న డబ్బును లేదా ఆహారాన్ని  కొంత ఆకలితో అలమటిస్తున్న వారికి, పేదవారికి  ఇవ్వడం ద్వారా మన జీవితం మరింత దీవెనకరంగా మారుతుందని" ఆయన అన్నారు.ఇచ్చే గుణాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని, క్రీస్తు జీవితం ఇదే సత్యాన్ని తెలియపరుస్తుందని ఆయన అన్నారు.

మనందరి రక్షణార్థం క్రీస్తు తన ప్రాణాలను ధారబోశారని, తన శరీరాన్ని జీవాహారంగా అందించారని,తన తల్లిని మన తల్లిగా అందించారని,తాను పరలోకానికి వెళుతూ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనకు తోడుగా అనుగ్రహించారని ఆయన అన్నారు.క్రీస్తు తండ్రి నుండి పొందుకున్న ప్రతిది తన దగ్గర దాచుకోకుండా మనకే అందించారని, ప్రతి ఒక్కరూ ఈ సుగుణాన్ని అలవర్చుకొని, మీ దగ్గరకు వచ్చే పేదలను నిరాకరించకుండా  సహాయ, సహకారాలు అందిస్తూ దైవ, మానవ సేవలో వర్ధిల్లాలని హేతువు పలికారు.అనంతరం ప్రపంచ పేదల దినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం  పోప్ ఫ్రాన్సిస్‌తో కలిసి వార్షిక భోజనం కోసం మొత్తం 1,200 మందికి పైగా ప్రజలు వచ్చారు.  పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేసి  భోజనాన్ని ఆశీర్వాదంతో పాటు పేదలతో కలసి భోజనం చేసారు.