ప్రపంచంలోనే ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్

 ప్రపంచంలోనే ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్

దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన, సమాజంలోని వివక్షల తొలగింపుకు ప్రత్యేక కృషి సల్పిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ గారికి  125 అడుగుల విగ్రహం, స్మృతివనంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఘన నివాళి అర్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో ముందుకు దూసుకు పోతున్నారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ గారి విగ్రహం, అంబేద్కర్ స్మృతివనం నిన్న సాయంత్రం (19 జనవరి 2024)న ఆవిష్కరించారు.


ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం (Statue Of Social Justice )పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ వస్తువులతోనే రూపొందించారు. ఇందుకోసం రూ.404.35 కోట్లు ఖర్చు చేశారు. 18.18 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 85 అడుగులుంటుంది.  పీఠంపై జీ ప్లస్ 2 తరహాలో గదులు నిర్మించారు. పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. మొత్తంగా 18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటైంది. ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలుంటాయి. అందమైన గార్డెన్‌ తో పాటు  మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.

ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవది. మొదటిది స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండవది శంషాభాద్ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది పంచలోహాలతో నిర్మితమైంది. ఇక మూడవది విజయవాడలో ప్రారంభమైన  206 అడుగుల ఎత్తులోని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం.