పెంతుకోస్తు పండుగ

క్రీస్తు ప్రభువు మన పాపములకొరకై సిలువ పై మరణము పొంది, పునరుత్థానమైన తరువాత ఆయన తన శిష్యులకు పలు మార్లు ప్రత్యక్షపరుచుకున్నారు. క్రీస్తు మోక్షరోహణ తర్వాత యూదులు క్రీస్తు ప్రభుని అనుసరించే వారిని వెతికి చంపడం ప్రారంభించారు. శిష్యులు యూదులు తమను చంపుతారేమో అనే భయంతో ప్రజలలో తిరగకుండా దాక్కొని బ్రతుకుతున్న కాలంలో, మరియతల్లి వారందరిని ఏకం చేసారు. 

అది ఒక ఆదివారం సాయంసమయం. శిష్యులందరు ఒక గదిలో సమావేశమైన సమయంలో క్రీస్తు ప్రభువు వారికి ప్రత్యక్షమై "మీకు శాంతి కలుగును గాక"అని పలికి వారిపై తన శ్వాసను ఉదారు. అప్పుడు అగ్ని నాలుకల రూపంలో పవిత్రాత్మ వారిపైకి వచ్చి వారిని శక్తివంతులను చేసింది. 

వెంటనే శిష్యులు బైటికి వచ్చి సువార్తను బోధించడం ప్రారంభించారు. వారు మాట్లాడినది పలు దేశస్తులు తమ తమ స్వంత భాషలలో విన్నారని బైబిల్ గ్రంధం మనకు చెప్తుంది.

ఈ మహా అద్భుతం జరిగిన రోజునే పెంతుకోస్తు పండుగగా మనం కొనియాడుతున్నాము. పెంతుకోస్తు అంటే గ్రీకు భాషలో 50 వ రోజు అని అర్ధము. 

క్రీస్తు పునరుత్థానమైన తరువాత 50 వ రోజు ఈ అద్భుతం జరిగింది. సుష్యుల పై పవిత్రాత్మ దిగి వచ్చిన రోజు ఈ రోజు. సువార్త పరిచర్య ప్రారంభమైన రోజు ఈ రోజు. శ్రీసభకు పునాదులు పడిన రోజు ఈ రోజు. అందుకే ఈ రోజును శ్రీసభ జన్మదినోత్సవం అని కూడా అంటారు.

జ్ఞానస్నానము ద్వారా మనందరమూ జన్మ పాపము నుండి విముక్తులమైయ్యాము. దివ్యసత్ప్రసాదం స్వీకరించడం, భద్రమైన అభ్యంగనము పొందడం ద్వారా మనం పవిత్రాత్మ వరములను పొడగలుగుతున్నాం. తద్వారా మనం కూడా శ్రీసభలో భాగస్తులమౌతున్నాం. శ్రీసభలో భాగస్తులమైన మనందరం శ్రీసభ జన్మదినంలోకూడా భాగస్తులమే. కనుక మనందరం సంతోషించి ఆనందించాల్సిన రోజు ఈ రోజు. 

అందరికి పెంతుకోస్తు పండుగ మరియు శ్రీసభ జన్మదినోత్సవ శుభాకాంక్షలు

Add new comment

1 + 6 =