క్రిస్మస్ తాత ఎవరు?

క్రిస్మస్ తాతపునీత నికోలస్

క్రిస్మస్ తాత ఎవరు?

క్రిస్మస్ అనగానే క్రీస్తు ప్రభువు తరువాత అందరికి గుర్తు వచ్చే వ్యక్తి  క్రిస్మస్ తాత. మనకు తెలిసినంత వరకు క్రిస్మస్ తాత ఎర్రని దుస్తులు ధరించి తెల్లటి గెడ్డం మీసాలతో, అందరికి బహుమతులు ఇచ్చే వ్యక్తి. 

అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరు? ఎక్కడ పుట్టాడు? ఎందుకు బహుమతులు పంచుతాడు?

క్రీస్తు ప్రభువు చనిపోయిన మూడు దశాబ్దాల తర్వాత నేడు టర్కీగా పిలువబడుతున్న అప్పటి లైసియా రాజ్యం లో జన్మించాడు. ఆయన అసలు పేరు నికోలస్. ఆయన ఒక సంపన్న క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నికోలస్ కు దైవ చింతన చాల ఎక్కువ. 19 వ ఏటనే గురువుగా అభిషిక్తుడై దైవ సేవ ప్రారంభించారు. జీవితమంతా క్రీస్తును ఆదర్శంగా తీసుకొని ఎంతో సేవ చేసారు. 

పేదలన్నా, చిన్నారులన్నా ఆయనకు ఎంతో ప్రీతి. తన ఆస్తినంతా పేదలకు పంచిన గొప్ప వ్యక్తి పునీత నికోలస్ గారు. పగలు పేదల వాడల్లో కలియ తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ, రాత్రి సమయంలో ఎవ్వరికి కనిపించకుండా వారికి సహాయం చేసేవారు. వారి ఇళ్లల్లో డబ్బు మూటలు గాని, లేక వారికి అవసరమైన వస్తువులు గాని విడిచి వెళ్లేవారు. ఆయన గుప్తదానాలు ఎంత ప్రచారంలోనికి వచ్చాయంటే, ఎవరికి అనుకోని విధంగా సహాయం అందినా అది పునీత నికోలస్ గారి వల్లనే అని ప్రజలు భావించేవారు. క్రీస్తు శకం 342 డిసెంబర్ 6 న ఆయన మరణించారు. 

తన బహుమతుల ద్వారా పేదల కష్టాలను మరియు పిల్లల కోరికలను తీర్చే వ్యక్తిగా ఆయన బహు ప్రాచుర్యం పొందారు. తర్వాతి కాలంలో పునీత నికోలస్ గారిని క్రిస్మస్ తాత గా పిలవడం ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవుల నమ్మకం ప్రకారం, క్రిస్మస్ తాత ఉత్తర దృవం వద్ద ఉంటారని, సంవత్సరం పొడవునా ఆయన మనకు బహుమతులు తయారు చేస్తూ ఉంటారని, క్రిస్మస్ రోజు రాత్రి ఆయన అందరి ఇళ్లను సందర్శించి, వారు నిద్రిస్తున్న సమయంలో వారికి కావలసిన బహుమానాలు వారి ఇంట్లో విడిచి వెళ్తారని ప్రచారంలోనికి వచ్చింది.

 ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా దాతృత్వ మరియు సేవ కార్యక్రమాలను చేయడాన్ని అలవర్చుకోవాలి.

Add new comment

13 + 1 =