" యేసు నామకరణ మహోత్సవం" |విశాఖ అతిమేత్రాసనం,

విశాఖ అతిమేత్రాసనం,క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం, యర్ర సామంతవలస గిరిజన విచారణ లో " యేసు నామకరణ మహోత్సవం" కడు రమణీయంగా, వైభవంగా,దేవునికి మహిమ కరముగా జరిగింది. 

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు , యర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు ఈ వారం కూడా ప్రజలను ప్రభువు మార్గంలో నడిచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మండే సూర్యుని వేడి లెక్క చేయకుండా, వేలాది మంది భక్తులు పాల్గొని ఆ దేవుని దీవెనలు పొందారు. స్తుతులతో,పాటలతో,ప్రార్థనలతో  ప్రభు యేసు నామాన్ని ఘనపరిచారు. 

బొబ్బిలి విచారణ కర్తలు గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారు,సాలూరు విచారణ కర్తలు గురుశ్రీ మరియదాసు గారు ముఖ్య అతిధులు గా  పాల్గొన్నారు. ఇతర గురువులతో కలసి దివ్యపూజాబలిని సమర్పించారు. విచారణ గాయక బృదం మధుర గీతాలని ఆలపించారు. తెలుగు సంస్కృతి ప్రకారం బాలయేసు పరిశుద్ద స్వరూపాన్ని  ఊయలలో వుంచి, భక్తులు దూపారాధన చేసి ప్రభుని ఘణపరిచారు.  

 

వివాహమై చాలా సంవత్సరాలు అయినా బిడ్డలు లేనివారు, ఇక్కడ ప్రార్థించిన తర్వాత  ప్రభువు వారికి ఇచ్చిన బిడ్డలను అందరికీ చూపించి , సాక్ష్యాలు ఇచ్చారు. ప్రభువు ఉంచిన  ఊయలను , వేలం పాట పాడి తన్మయత్వం పొందారు. ప్రజలు తమతో తెచ్చుకున్న భోజనాలను గురువులు,కన్యాస్త్రీలు, బ్రదర్స్ తో పంచుకుని కలిసి భుజించి  ఆనందంతో వెళ్ళారు . ఆద్యంతం భక్తిశ్రద్ధలతో, కన్నుల పండుగగా ఈ మహోత్సవం జరిగింది. ఎప్పటిలాగే గురుశ్రీ వాడల్పాటి  మరియాదాస్ (చినబాబు) గారు తన సహాయ సహకారాలను అందించారు. 

ప్రభురాజ్యం ప్రకటించుటకు ఉన్నతమైన పనికై ఎన్నుకోబడి, నిరంతరం తన సంఘాన్ని కాపాడుతూ ,  మంచి కాపరి గా ప్రజలను సువార్త  కై  పోరాడుటలో "సిద్ధపడిన సైన్యం" లా  తయారు చేస్తున్న   "గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు" గారికి  ఎల్లప్పుడు ఆ దేవాది దేవుని దీవెనలు ఉండాలని  కోరుకుంటూ మీ అమృతవాణి - రేడియో వెరితాస్ ఆసియ తెలుగు.   

Add new comment

1 + 0 =