యువత భయభక్తులతో జీవించాలి

యువత భయభక్తులతో జీవించాలని ఆంధ్రప్రదేశ్ హోంశాఖామాత్యులు శ్రీమతి తానేటి వనితగారు పేర్కొన్నారు. మంగళవారం ఏలూరులో జరుగుతున్న తెలుగు ప్రాంతీయ కథోళిక యువతా సమాఖ్య ప్రాంతీయ సదస్సులో రెండో రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోం మినిస్టర్ గారిని ఏలూరు డయాసిస్ మేత్రాణులు మాహాఘన శ్రీశ్రీశ్రీ పొలిమేర జయరావ్ గారు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో యవ్వనం ముఖ్యమైన దశ అని తెలిపారు. ఇప్పుడే యువత చాలాజాగ్రత్తగా ఉండాలని, మంచి అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. ఈ వయసులో స్వతంత్ర భావాలు అలవర్చుకుంటామని, ఏ పని చేసినా ఒకరి అజమాయిషీ లేకుండా స్వేచ్ఛగా చేయాలనుకుంటామన్నారు. ఇక్కడే ఏది మంచి, ఏది చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాత్కాలిక ఆనందాలకు విలువ ఇవ్వరాదన్నారు. తల్లిదండ్రుల మాటను గౌరవించాలని, వారి మాటలను ఆచరణలో పెట్టాలన్నారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని ప్రేమే శాశ్వతమని తెలిపారు. తాను 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక మహిళగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానన్నారు. కానీ దేవుని దయ వలన అన్నింటిలో విజయం సాధిస్తూ వస్తున్నానని తన స్వీయ అనుభవాలు పంచుకున్నారు. అంతకు మునుపు అక్కడికి చేరిన తెలుగు రాష్ట్రాల యువతీయువకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిషప్ పొలిమేర జయరావ్, ఇతర ఫాదర్లు హోం మినిస్టర్ ని ఘనంగా సన్మానించారు.

Add new comment

15 + 2 =