ప్లాస్మా అంటే ఏమిటి?

plasma

ప్లాస్మా అంటే ఏమిటి?
ప్లాస్మా చికిత్స ద్వారా కోవిడ్-19 బారిన పడిన వారు కోలుకుంటారు అని వైద్యలు చెపుతున్న నేపథ్యంలో ప్లాస్మా  సేకరణకు ఇటీవల కాలంలో విపరీతంగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ సోకిన కొంత మంది ఇప్పటికే ప్లాస్మాని దానం చేయడం జరిగింది.  
అసలు ప్లాస్మా అంటే ఏమిటి? ప్లాస్మా ఎక్కడ దొరుకుతుంది ?

రక్తంలో ఎర్ర రక్తకణాలు,తెల్ల రక్తకణాలు, ప్లాస్మా లాంటి పదార్ధాలు ఉంటాయి.రోగి ఒక తీవ్రమైన రోగం బారిన పడిన తర్వాత శరీరం ఆ రోగం నుంచి కోలుకోవడానికి పట్టే దశను కన్వల్సెంట్ అంటారు. ఈ దశలో రోగి శరీరంలో యాంటీబాడీలు తయారై, రోగి  కోలుకోవడానికి సహాయపడతాయి. దాత నుంచి రక్తం తీసుకుని అందులో ఉండే ప్లాస్మా అనే ద్రవ పదార్ధాన్ని మొదట సేకరిస్తారు. ఈ కన్వల్సెంట్ ప్లాస్మాతో చేసే చికిత్సను ప్లాస్మా థెరపీ లేదా కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అంటారు.సాధారణం గా ప్రతి రెండు వారాలకి ఒకసారి శరీరం యాంటీబాడీలను తయారు చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది.కరోనా నుండి కోలుకున్న దాతల యాంటీబాడీ టైట్రస్ ను పరీక్షించాకే  ప్లాస్మా దానం చేయాలో  లేదో నిర్ణయిస్తారు.

కరోనా బారిన పడి కోలుకున్నవారందరూ వైద్య నిబంధనల ప్రకారం ప్లాస్మా దానం చేసేందుకు అర్హులు కాదు. కరోనా బారిన పడి కోలుకున్న 28వ రోజు నుంచి 3 నెలల లోపు ప్లాస్మాని సేకరించాలి. ప్లాస్మా దాతలు 18 - 50 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. ప్లాస్మా దాత డయాబెటిస్ లాంటి ఇతర లక్షణాలు లేకుండా  ఆరోగ్యంగా ఉండటంతో పాటు కనీసం 50 కిలోల బరువు ఉండాలి.కరోనా సోకిన 7రోజులలోగానే ప్లాస్మా థెరపీ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్-19 నయం చేయవచ్చని కచ్చితంగా చెప్పలేమని ఐసీఎంఆర్ చెప్పినప్పటికీ ప్రస్తుతానికి చాలా మంది రోగుల్లో ఈ చికిత్స పని చేస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులలోనే ప్లాస్మా సేకరిస్తున్నారు. ప్లాస్మా దానం కూడా రక్త దానంలానే వలె స్వచ్ఛందంగా జరుగుతుంది.
సైబరాబాద్ పోలీసు శాఖ ప్లాస్మా సేకరణ, దానం కోసం www.donateplasma.scsc.in అనే వెబ్ సైట్‌ను ఇదివరకే ప్రారంభించారు.ప్లాస్మా దాతలను ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయిల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.

Add new comment

2 + 0 =