థామస్ కుక్ ఇక లేదు

Thomas cook AirlinesThomas cook Airlines

థామస్ కుక్ ఇక లేదు: కష్టాల్లో ఉన్న ప్రముఖ బ్రిటిష్ విమాన యాన సంస్థ...6 లక్షల విమాన టికెట్లు రద్దు, దిక్కు తోచని పర్యాటకులు 

లండన్ : ప్రముఖ బ్రిటీష్ టూర్ కంపెనీ థామస్ కుక్ ఎయిర్‌వేస్ సంస్థ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. సంస్థలో నిధుల ప్రవాహం లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 600,000 పర్యాటకుల టికెట్లను రద్దు చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బ్రిటన్ కస్టమర్లు తిరిగి బ్రిటన్‌కు చేరుకునేందుకు ముందస్తుగా థామస్ కుక్ ఎయిర్‌వేస్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వీరి టికెట్లన్నీ రద్దు కావడంతో ఆయా దేశాల్లోనే నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి తమ దేశానికి 1,50,000 మంది ప్రయాణికులను తీసుకురావాల్సిన బాధ్యత బ్రిటన్ ప్రభుత్వంపై పడింది.

16 దేశాల్లో థామస్‌కుక్ సేవలు

ఇక థామస్ కుక్ ఎయిర్‌వేస్ సంస్థ తమ విమానాలను నిలిపివేయడంతో 16 దేశాల్లో ఈ సంస్థకు పనిచేస్తున్న 21వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు వీధిన పడ్డట్లయ్యింది. ఇందులో యూకేకు చెందిన 9వేలు మంది ఉద్యోగులు ఉన్నారు. బ్రెగ్జిట్‌తో నెలకొన్న డోలాయమానమే తమ సంస్థ సంక్షోభంలోకి వెళ్లేందుకు కారణమైందని థామస్ కుక్ ఎయిర్‌వేస్ యాజమాన్యం గతంలో వెల్లడించింది. 178 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ పర్యాటక సంస్థ నష్టాల నుంచి గట్టెక్కాలంటే 200 మిలియన్ పౌండ్లు అవసరమవుతాయని వెల్లడించింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కంపెనీ షేర్‌హోల్డర్స్, రుణదాతలతో చర్చలు ప్రారంభించింది. థామస్ కుక్ సంస్థ యూకేలో 600 ట్రావెల్ స్టోర్లను కూడా నిర్వహిస్తోంద.

థామస్‌ కుక్ కంపెనీకి దుర్దినం

"ఈ రోజు థామస్ కుక్ కంపెనీకి దుర్దినం. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను ఆయా పర్యాటక ప్రదేశాలకు మా విమానాలు మోసుకెళ్లాయి. ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. అయితే మరింత నిధులు అవసరం అవడంతో ఏమీ చేయలేకపోతున్నాం"అని థామస్ కుక్ సంస్థ సీఈఓ పీటర్ ఫ్రాంక్‌హాసర్ తెలిపారు. తమ లక్లలాది కస్టమర్లకు, ఉద్యోగస్తులకు ఈ సందర్భంగా క్షమాపణ కోరుతున్నట్లు పీటర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

బ్రిటన్ పర్యాటకులకు ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్ ఏర్పాటు

ఇదిలా ఉంటే ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన థామస్ కుక్ ఎయిర్‌వేస్ కస్టమర్లను తిరిగి బ్రిటన్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే మలేషియా నుంచి కొన్ని విమానాలను అద్దెకు తీసుకుని తమ దేశస్తులను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించినట్లు బ్రిటన్ రవాణాశాఖ కార్యదర్శి గ్రాంట్ షాప్స్ తెలిపారు. ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కస్టమర్లను తరలిస్తున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పిన గ్రాంట్... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

థామస్ కుక్ చరిత్ర

థామస్ కుక్ సంస్థ 1841లో పిక్నిక్ పేరుతో రైలు సేవలను ఇంగ్లాండ్‌లో ప్రారంభించింది. కాలక్రమంలో ఈ సంస్థ సేవలు 16దేశాలకు విస్తరించాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ సంస్థను సంక్షోభం వెంటాడుతోంది. ఈ మధ్యనే చైనాకు చెందిన షేర్‌హోల్డర్ ఫోసన్‌ నుంచి 900 మిలియన్ పౌండ్లను నిధులు సమకూర్చినప్పటికీ సంక్షోభం నుంచి మాత్రం గట్టెక్కలేకపోయింది. ఇక రానున్న రోజుల్లో టికెట్స్ బుక్ చేసుకున్న దాదాపు 1 మిలియన్ మంది ప్రయాణికుల టికెట్లు రద్దు కానున్నాయి.

Add new comment

7 + 6 =