తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఓ మాదిరి వర్షాలు కురిశాయి. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణలో మరో నాలుగైదు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో లోటు వర్షపాతం ముప్పు చాలా వరకు తగ్గింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఆగష్టు 4న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తీవ్రంగా మారి పశ్చిమ దిశగా పయనిస్తే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవగా.. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్ల మీద వరద నీరు వచ్చి చేరింది. 24 గంటల్లో నగరంలో 15 మి.మీ. వర్షం కురిసింది. వర్షం కారణంగా జనాలు ట్రాఫిక్‌తో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరో నాలుగు రోజులపాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో, ఎగువన కురుస్తోన్న వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో.. గేట్లన్నీ ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. రోజుకు 7 లక్షల క్యూసెక్కులపైగా గోదావరి జలాలు బంగాళాఖాతాంలో కలుస్తున్నాయి. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 40 అడుగులుగా ఉంది.

Add new comment

3 + 9 =