కరోనా వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు క్రమంగా వ్యాప్తిచెందుతోంది | Corona virus

చైనాను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు క్రమంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా ఈ వైరస్ లక్షణాలు హైదరాబాద్‌లోనూ కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇప్పటి వరకూ కరోనా వైరస్ లక్షణాలను నిర్ధారించకపోయినా.చైనా, హాంగ్‌కాంగ్‌‌ల నుంచి వచ్చినవారిలో భయాందోళనలు నెలకొన్నాయి. వైరస్ లక్షణాలు బయటపడకపోయినా ముందుగా వైద్యులను సంప్రదిస్తున్నారు. గతవారం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ డాక్టర్ జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో మరో నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానంతో టెస్టులు చేస్తున్నారు. వీరిలో ముగ్గురు చైనా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చిన వ్యక్తులు కాగా, మరొకరు వారిలో ఒకరి భార్య ఉన్నారు. ఈ నలుగురినీ ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపించడంతో అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పుణెకు పంపించారు. ఈ ఫలితాలు సోమవారం వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి. మిగిలిన ముగ్గురిలో ముక్కు కారడం తప్ప మరే ఇతర లక్షణాలు లేవు.

ప్రసార మాధ్యమాల్లో కరోనా వైరస్‌ గురించి వస్తున్న కథనాలతో భయాందోళనలకు గురై, స్వచ్ఛందంగా వారే హాస్పిటల్‌లో చేరినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ నలుగురినీ నిశితంగా పరిశీలిస్తున్నామనీ, ప్రస్తుతానికి జలుబుకు సంబంధించిన సాధారణ చికిత్స మాత్రమే అందజేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు, నమూనాలు సేకరించిన వ్యక్తి ఫలితాల్లో పాజిటివ్ వచ్చినా.. హాస్పిటల్‌లోని వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి విషమించినా.. అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఎనిమిది పడకల ఐసీయూను కూడా వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.

మన దేశంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా, ఇది వైరస్ కాబట్టి  గాలి ద్వారా ఒకరి నుంచీ మరొకరికి సోకుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదే.

ఈ వ్యాధి కోసం తెలుసుకొందాం

వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది.  తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి.,గొంతు మంటగా ఉంటుంది.నీరసం గా ఉన్నట్లు   ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే  వెంటనే డాక్టర్‌ను కలవాలి.

వైరస్ ఎలా వ్యాపిస్తుంది : ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా , పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే రోగిని ముట్టుకున్నా, షేక్ హ్యాండ్  ఇచ్చినా  వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్  బాడీపైకి వచ్చి క్రమంగా అవి నోట్లోంచీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు (వ్యాక్సిన్) లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు.

ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే  వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ ఎక్కువ నీళ్లు తాగాలి. ఒకట్రెండు రోజుల్లో అవి తగ్గకపోతే  వెంటనే డాక్టర్‌ను కలవాలి

Add new comment

1 + 2 =