SAINT OF THE DAY – October 8 పునీత సిమియోను|ST. SIMEON

దీర్ఘదర్శి, ప్రభువు స్తుతిగీతాన్ని ఆసువుగా ఆలపించిన భక్తుడు, మతసాక్షి (1వ శతాబ్దం )  పవిత్ర లేఖనాల ప్రకారం పునీత సిమియోనుగారు జెరుసలేము పవిత్రనగరంలో జీవించారు. వారు బహునీతిమంతుడు గొప్ప దైవ భక్తుడు కూడాను. వారు ఇస్రాయేలు ప్రజల రక్షణ కోసం ఎదురుచూస్తున్న మనిషి. పవిత్రాత్మతో నిండి ఉన్న పరిశుద్దుడు. ఒక ప్రవక్త. దైవం వాగ్దానంచేసిన మెస్సియా అనగా క్రీస్తును తనకనులారా చూసేంత వరకు జీవించి ఉండేవరాన్ని పవిత్రాత్మ ద్వారా పొందివున్న  అదృష్టవంతుడు. అట్టి పవిత్రాత్మ ప్రేరణవల్లనే వారు సమయంలో దేవాలయ ప్రవేశం చేశారు.

అదే వేళలో పవిత్ర మరియ యోసేపులు తల్లిదండ్రుల ఆచార విధులు నిర్వర్తించడానికి బాలయేసును జెరుసలేము దేవాలయంలోకి కానుకచేయ తీసికొనివచ్చారు. అప్పుడు భక్త సిమియోనుగారు ఆ దివ్య బాలుని తన హస్తాల్లోకి తీసికొని దేవునికి ఒక స్తుతిగీతాన్ని ఆసువుగా ఆలపించారు. “ప్రభూ ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు.” (లూకా 2:29-32) అన్నారు.

మరియ యోసేపుగార్లు దివ్యబాలునిగూర్చి బహిర్గతమొనర్చిన పలుకులకు మిక్కిలి ఆశ్చర్యచకితులయ్యారు. పునీత సిమియోను ప్రవక్త వారిని దీవించి, ఆ బిడ్డ తల్లియైన మరియమ్మగారితో “ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలు పరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది.” (లూకా 2:34-35) అని దీర్ఘదర్శనం పలికారు. ఇది వారు చెప్పిన గొప్ప ప్రవచనంగా ప్రసిద్ధికెక్కింది. సిమియోను అనగా దేవుడు ఆలకించెను అని అర్థం.

 

Add new comment

2 + 0 =