SAINT OF THE DAY – April 5 పునీత విన్సెంట్ ఫెర్రర్|St. VINCENT FERRER

@pjsri

(స్పెయిన్ దొమినికన్ గురువు, ప్రసిద్దసువార్తా సేవకుడు, ఇటుకలు పెంకులు తయారీదారులు, రాళ్లు పరచు పనివాండ్రు,ఇనుము పనివాండ్ర పాలక పునీతుడు. మతసాక్షి క్రీ||శ|| 1350-1418) పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు స్పెయిన్ దేశంలోని వలెన్షియ పట్టణంలో క్రీ||శ|| 1350 జనవరి 23వ తేదీన జననమయ్యా రు. తండ్రి పేరు ఫెర్రర్ కాగా తల్లి పేరు కాన్ స్టన్శియ మిగ్వెల్ ఇరువురూ గొప్పవంశం నుండి వచ్చినవారే. విన్సెంట్ గారు  స్వగ్రామంలోనే విద్యాభ్యాసంగావించారు. తమ 14వ ఏట తత్వశాస్త్రవిద్యలో నిష్ణాతులయ్యారు. మరో మూడేండ్లకు అనగా క్రీ||శ|| 1367లో తానొక గురువు కాదలచి దొమినికన్ సభలో ప్రవేశించారు.

పైచదువులకు బార్సెలోనా (స్పెయిన్) పట్టణం పంపబడ్డారు. పిమ్మట తమ 21వ ఏట లెరిడా విద్యాలయంలో తత్వశాస్త్రం బోధింపవెళ్లారు. అక్కడ మూడు సంవత్సరాలుండి తిరిగి తౌలోయుస్ పట్టణంలో పైచదువులు చదివారు. ఆ తరువాత గురువై వారొక సుప్రసిద్ధ సువార్తా ప్రచారకుడుగా సేవలందించారు. ఆరోజుల్లో శ్రీసభ అధినాయకత్వంలో గొప్ప చీలిక వచ్చింది. అందులో ఫాదర్ విన్సెంట్ గారు కూడా పాత్రధారి. ఈ చీలిక క్రీ||||1378 నుండి 1409 వరకు కొనసాగింది. ఇద్దరు వ్యక్తులు నేనంటే నేను నిజమైన పోపుగార్లంటు ఒకరు రోము నగరంలోను మరొకరు అవిన్యోన్ నగరంలోను ఉండి శ్రీసభను పాలించారు.

క్రీ|||| 1379లో పునీత విన్సెంట్గారు కార్డినల్ పీటర్ దే లూన గారి పీఠంలోని న్యాయస్థానంలో ఒక సభ్యుడుగా అయ్యారు. ఈ కార్డినలుగారు. అవిన్యోన్ నగరంనుండి శ్రీసభనేలుతున్న7వ క్లెమెంట్ పోపుగారి మద్దతుదారుగా ఉండేవారు.  క్లెమెంట్గారి మరణానంతరం కార్డినల్ పీటర్ దే లూనగారే వారి స్థానంలో పోపుగారిగా గద్దనెక్కి 13వ బెనడిక్టుగా పేరుబడశారు.

క్రీ|||| 1384లో కేథడ్రల్ విద్యాశాలలో విన్సెంట్ గారు  ప్రొఫెసరుగా పనిచేశారు.

క్రీ|||| 1391లో విన్సెంట్గార్ని అరగాన్ రాజు 1వ జాన్ తమ సలహాదారుగాను, రాణిగారి ఆథ్యాత్మిక అవసరాలు తీర్చే గురువుగాను నియమించారు.

అయితే తన ఎన్నిక పిమ్మట క్రీ||శ|| 1394లో 13వ బెనడిక్టు పోపుగారు అవిన్యోన్ నగరానికి రావాల్సిందిగా విన్సెంట్ గారు  ఆదేశించారు. వారిని తమ పీఠంలోనే ప్రధాన గురువుగా ఏర్పాటు చేసుకున్నారు. అవిన్యోన్లోని బెనడిక్టు పోపుగారే నిజమైన పోపుగారని ఫాదర్ విన్సెంట్ నమ్మారు.కాని ఒక దేవదూత దర్శనం ద్వారా బెనడిక్టుగారి పాలన పేతురు ఆధిపత్య సింహాసనానికి వ్యతిరేకమని అర్థమైంది. ఇది వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయ్యింది.

తన అభ్యర్థన మేరకు క్రీ. 1399లో బెనడికుగారు విన్సెంట్గార్కి అవినోన్ పట్టణం విడిచివెళ్లి మత ప్రచారం చేసుకోడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు.

ప్రజల్లో చొచ్చుకుపోయి పాపపశ్చాత్తాపం గూర్చి బోధించి విశ్వాసులను దృఢపరచి దేవుని అంత్యతీర్పునకు సంసిద్దంచేయ అనుమతించారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కాలినడకన పేద వస్త్రధారియై దాదాపు ఇరవై సంవత్సరాలు సువార్తా ప్రచారం ముమ్మరంగా జరిపారు. ఫ్రాన్సు, స్విట్జర్లాండు,ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఇంగ్లాండు, స్కాట్లాండు, ఐర్లాండు దేశాల్లో విస్తారంగా ప్రబోధించారు.

వారి సందేశాలు వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా తరలి వచ్చేవారు. ఏ గుడీ పట్టేదికాదు. అందువల్ల నాలుగు రోడ్ల కూడళ్లలోను బహిరంగ సువిశాల ప్రదేశాల్లోను వారు ప్రసంగింపనెంచుకునే వారు. విన్సెంటుగారికి పలు భాషా వరం ఉంది. వారు ప్రబోధించేటప్పుడు వినడానికి వచ్చిన ప్రజలకు వారి సొంత భాషలో సందేశం విన్పించేది. తద్వారా సందేశాలు వారి హృదయాలను హత్తుకొని ఆత్మ చైతన్యం మనోస్పందన కలిగేవి.

ఫాదర్ ఫెర్రర్ గారు క్రీస్తు శ్రమలగూర్చి పాపప్రాయశ్చిత్తంగూర్చి ఒక్కోమాట చెప్తుంటే ప్రజలు భావోద్వేగాన్ని ఆపుకోలేక బిగ్గరగా రోదించేవారు. వారి ప్రసంగం అంత శక్తి వంతంగా ఉండేది. అనేకసార్లు విన్సెంటుగారు ప్రజల్ని ఓదార్చుతుండేవారు. అన్నింటికి మూలమైన క్రీస్తే తమ దిక్కు అని ఓర్మి వహించమని కోరుతుండేవారు.

వేలాదిగా అన్యులు మనసు మార్చుకుని జ్ఞానస్నానం పొందేవారు. పాపాత్ములు, కఠినాత్ములు తమ చెడు అలవాట్లు మానుకొని సాధుస్వభావులుగా మారారు. ఒక్క స్పెయిన్ దేశంలోనే 25 వేల మంది యూదులు 8 వేలమంది మూర్ ప్రజలు క్రీస్తే దేవుడు రక్షకుడని నమ్మి శ్రీసభలో ప్రవేశించారు. ఉత్తర ఇటలీ, దక్షిణ ఫ్రాన్సుల్లో వేలాది శ్రీసభ వ్యతిరేకులు మారుమనస్సు పొంది. పరిశుద్ద పోపుగారి ఆధిపత్యంను విశ్వసించారు.

లెక్కలేనంతమంది విగ్రహారాధకులు, నాస్తికులు, అగమ్యులు ఫాదర్ విన్సెంట్గారి మహత్తర సందేశాలవల్ల శ్రీసభకు దగ్గరయ్యారు. ఆశ్చర్యకరమైన ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు ప్రజలకు కలిగాయి. వారు తమ సువార్తా ప్రచారం కోసం ఒక పట్టణంనుండి మరొక పట్టణంకు తరలి పోతున్నప్పుడు వారితో పాటు గొప్ప ప్రజాదండు కదలివెళ్తుండేది.

పదివేల మందికి తక్కువ కాకుండా స్త్రీలు, పురుషులు యింకా ఎందరో గురువులు గొప్ప విశ్వాస తేజంతో వారిని అనుసరిస్తుండేవారు. క్రీస్తు ప్రభువే విన్సెంటుగార్ని ఆవహించి నడిపిస్తున్నారు, మాట్లాడిస్తున్నారని విశ్వాసులు నమ్మేవారు. పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు భవిష్యత్ చెప్పగలిగే దేవునివరం పొందియున్నారు. తండోపతండాలుగా ఉన్న ప్రజల్లోనుండి వారు ఉత్తర ఇటలీకి చెందిన సియోనానగర బెర్నర్టీన్ గార్ని, సవోయ్ రాజ్య మార్గరేట్ గార్ని దేవుని సేవకులౌతారని పేరు పెట్టిపిల్చారు. వారు సువార్తా సేవకులుగా మారి పునీతులుకావడం విశేషం.

Add new comment

1 + 2 =