SAINT OF THE DAY | పునీత అవిలా తెరేసమ్మ |ST. TERESA OF AVILA

SAINT OF THE DAY – OCTOBER 15 పునీత అవిలా తెరేసమ్మ|ST. TERESA OF AVILA

SAINT OF THE DAY – OCTOBER 15 పునీత అవిలా తెరేసమ్మ|ST. TERESA OF AVILA
(స్పెయిన్ కార్మెలుసభ కన్యస్త్రీ, మొదటి మహిళా శ్రీసభ పండితురాలు, స్పెయిన్ పాలక పునీతురాలు, మతసాక్షి క్రీ||శ|| 1515 - 1582)

పునీత తెరేసమ్మగారు స్పెయినుదేశంలోని అవిలా నగరంలో 1515 మార్చి 28న ఈ లోకంలో కళ్లు తెరిచారు. తండ్రి పేరు అలోన్నొ సాంచెజ్ దె సెపెడ. ఈయన రెండవ భార్య అయిన బీట్రిచ్ దవిలా అహుమడ యే ఆమె తల్లి. చిన్న తనంలో తెరేసమ్మగారు పునీత అగస్టీను మఠకన్యలు నిర్వహించే పాఠశాలలో చదువుకుంటుండగా ఆమె అనారోగ్యంను బట్టి 1532లో పాఠశాలనుండి పంపివేయబడ్డారు.

తెరేసమ్మగారు తమ ప్రాథమిక విద్యా నంతరం ఒక కన్యస్త్రీ కావాలని ఆశించారు. 1536లో 21వ ఏట అవిలా నగరంలోని కార్మెలు మఠకన్యల సభలో ప్రవేశించారు. ఒక ఏడాది పిమ్మట వారికి మాటపట్టు, సభ ప్రత్యేక దుస్తులు ఇవ్వ బడ్డాయి. భక్తికి మారు పేరుగా ఆ యమ్మ పేర్గాంచారు. కాని దురదృష్టవశాతు 1538లో తీవ్ర జబ్బువల్ల విశ్రాంతికై ఇంటికి వెళ్లారు. తిరిగి 1540లో తమ 25వ సం||ర ప్రాయంలో తిరిగి మఠంలో ప్రవేశించి అప్పగింపబడిన బాధ్యతలు నిర్వర్తించారు.

క్రీ||శ|| 1555 - 56 మధ్య తెరేసమ్మగారికి తరచు ఏవో దర్శనాలు కలిగేవి. ఏవో సందేశాలు కూడ విన్పించేవి. అందుకువారికి అవేమి అర్థంకాక అతివేదనకు గురయ్యారు. క్రీ||శ|| 1557లో పునీత అలెయంతర పీటరు గురువర్యులు వారికి ఆత్మ గురువుగా నియమితులయ్యారు. ఈ ఆత్మ గురువు సలహాపై తెరేసమ్మగార్కి ఓదార్పుకలిగింది. ఆ దర్శనాలు మాటలు తనను ప్రోత్సహించేవేయని అర్ధమైంది. తమ మఠంలో కన్యస్త్రీలు ఎక్కువ స్వేచ్ఛగా ఉండుట తెరేసమ్మగార్కి నచ్చలేదు. అందుకు తానే నడుంకట్టి కొందరు శ్రేయోభిలాషులు కాదన్నా వినకుండ 1562లో అవిలా నగరంలో అనేక గట్టి కట్టుబాట్లతో పునీత యోసేపు కాన్వెంటును ఆరంభించారు. గొప్ప ఆథ్యాత్మిక భక్తి జీవితం ఆ కాన్వెంటు కన్యామణుల ధ్యేయం అయ్యింది.

క్రీ॥శ॥ 1567లో కార్మెలు మఠంకు జ్ఞానమార్గ చూపరియైన ఫాదర్ రుబెయోగారి అనుజ్ఞతో తెరేసమ్మగారు గట్టి కట్టుబాట్లతో మరికొన్ని కాన్వెంటులను తెరిచారు. మొత్తం 16 కాన్వెంటులు నిర్వహించారు. తెరేసమ్మగారు రెండవ కాన్వెంటును మెడినొ దెల్ కేంపో అనుచోట ప్రారంభించేటప్పుడు వారికి అక్కడున్న ఒక యువ గురువు పునీత జాన్ ఆఫ్ ది క్రాస్ (సిలువ యోహాన్) గారితో పరిచయమైంది. వీరునూ గొప్ప వేదాంతపండితులు దైవచిత్తంవల్ల ఫాదర్ సిలువ యోహాన్ గారి అజిమాయిషీలో తెరేసమ్మగారు పురుషులకోసం గట్టి కట్టుబాట్లతో ఒక కార్మెల్ సన్యాసుల మఠంను 1568లో దురుయేలో పట్టణంలో నెలకొల్పి నిర్వహింపజేశారు. ఇలా మరికొన్ని పురుషుల కోసం మఠాలు స్థాపించారు.

అవిలా తెరేసమ్మగారు ఒక మంచి పేరున్న మఠకన్యగా స్పెయిన్ దేశం నలుమూలల కలియ తిరిగారు. కార్మెలుసభను సమూలంగా సంస్కరింప అవిశ్రాంత కృషిసల్పారు. అయితే తెరేసమ్మగారు ఏర్పరుస్తున్న కఠినతర కట్టుబాట్లకు కినిసిన కొందరు కన్యస్త్రీలు వ్యతిరేక వర్గంగా తయారై క్రీ॥శ॥ 1575లో పియా సెంజా నగరంలో జరిగిన కార్మెలు మఠ సర్వసభ్య మహాసభలో తమ పిర్యాదును అభ్యంతరాలను గట్టిగా విన్పించారు. తత్ఫలితంగా కార్మెలు మఠ జ్ఞానమార్గచూపరి ఫాదర్ రుబెయోగారు తెరేసమ్మగారి సంస్కరణ వర్గంను కట్టుదిట్టం చేశారు.

ఈ వర్గాల పెనుగులాట కార్మెలుసభలో అయిదేళ్ల వరకు కొనసాగాయి. 1580లో 13వ గ్రెగోరి పోపుగారు 2వ ఫిలిప్ రాజు సిఫారసు పై పాదరక్షలు లేకుండా ఉండే సంస్కరణను పాటించే మఠకన్యలకు వేరుగా ఒక ప్రోవిన్సును ఏర్పరచారు. ఈ అయిదు సం||ల కాలంలో పునీత అవిలా తెరేసమ్మగారు స్పెయిన్ దేశాటన చేస్తూనే కొన్ని అమూల్యమైన లేఖలు, గ్రంథాలు లిఖించారు. అవి అద్భుతమైన ఆథ్యాత్మిక సాహిత్యంగా ఆవిర్భవించాయి. వాటిల్లో ఆత్మకథ (1565), పరిపూర్ణతకు బాట (1573), ఆంతరంగిక కోట (1577) దైవ ప్రేమతలంపులు అనేవి ముఖ్య మైనవి.

స్వాభావికంగా అవిలా తెరేసమ్మగారు దృఢ విశ్వాసం కలవారు. జ్ఞానానికి మారు పేరు. పట్టుదల చురుకుదలతో లోతైన ఆత్మీయ జీవితంకు అంకితమైనవారు. పవిత్ర ధ్యానంతో క్రైస్తవ మత వ్యాప్తికి ఉన్నత జీవిత శిఖరాలనధిరోహించిన ధీరవనిత. చరిత్ర సృష్టించిన మహిళామణిదీపం. ఇట్టి భక్తురాలు మరణశయ్య పై ఉండగా దివ్యసత్రసాదం ఇచ్చుటకు గురువు దగ్గరకురాగా ఆ యమ్మ “ఓ నా ప్రభూ ! మనం ఒకరికొకరం చూసుకోడానికి ఇప్పుడుసమయమైంది” అని పలికి దివ్య సత్రసాదంలోకొన్నారు. పిమ్మట స్పెయిన్ దేశంలోనే అల్బా దె టోర్మస్ పట్టణ కాన్వెంటులో తమ 67వ ఏట క్రీ||శ|| 1582 అక్టోబరు 4న (గ్రెగోరియన్ కేలండరు ప్రకారం అక్టోబరు 14న) దేవుని సమక్షంకు చేరుకున్నారు.

క్రీ||శ|| 1622లో 15వ గ్రెగొరి పోపుగారిచే పునీత పట్టా ప్రధానం చేయబడ్డారు. 1970లో 6వ పౌలు పోపుగారిచే వారు శ్రీసభ పండితురాలుగా ప్రకటింపబడ్డారు. ఈ విధంగా ప్రకటింపబడిన తొలి మహిళా పునీతురాలుగా పేరొందారు. వారి శరీరం శిధిలం కాకుండా నేటికి తాజాగా ఉండటం విశేషం. వార్ని స్పెయిన్ దేశ పాలక పునీతురాలుగా గౌరవిస్తున్నారు. వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించిన వారికి తలనొప్పి, తలపోటువ్యాధి త్వరగా నివారణమవుతున్నట్లు భక్తులు సాక్ష్యమిచ్చారు.

Add new comment

6 + 13 =