ముగ్గురు రాజుల మహోత్సవం

ముగ్గురు రాజుల మహోత్సవం

“హేరోదు రాజ్య పాలన చేస్తున్న కాలంలో  క్రీస్తు ప్రభువు యూదయ దేశంలోని  బెత్లెహేములో పశువుల పాకలో పుట్టారు. క్రీస్తు ప్రభువు పుట్టిన తరువాత, ఒక నక్షత్రం వెలసింది.  తూర్పు దిక్కున  నక్షత్రాన్ని చూసి లోక రక్షకుడు పుట్టాడని గ్రహించిన “ముగ్గురు రాజులు”  ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చారు.

 కాని వాళ్లు రాజులు కాదని చరిత్రద్వారా తెలుస్తోంది.  బైబిలు లో మత్తయి గారు  వాళ్లను వర్ణించడానికి  (మత్తయి 2:1) “జ్యోతిష్యులు/ నిపుణులు అనే అర్థం వచ్చేలా అన్నారు. వీరు  అస్సీరియా లేక బాబిలోనియా ప్రాంతంనుండి వచ్చి ఉండవచ్చని కొంతమంది వివరిస్తుండగా, పర్షియా (ఇరాను) నుండీ వాళ్ళు రావటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు కొంతమంది భావిస్తున్నారు.

 ఆ రాజుల వారి పేర్లు పేర్లేంటో బైబిలు చెప్పడం లేదు. కానీ  వాళ్లకు గస్పార్‌, మెల్కీయోర్‌, బాల్తాజార్‌ అనే పేర్లు ఉన్నాయని ద ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిలు ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది.

జ్ఞానులు యెరూషలేముకు వచ్చి వారు ప్రభు యేసుని సందర్శించి పూజింప సాగిలపడ్డారు. “తమ పెట్టెలు విప్పి, బంగారమును, సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి”. మనకు తెలుసు  బంగారం ఎంతో విలువైనది అని . బంగారం స్వచ్ఛతకు  గుర్తు. బంగారము రాజరికాన్ని సూచిస్తుంది. అది రాజుకు తగిన కానుకైయుంటుంది.

 సాంబ్రాణి, బోళము అనేవి యాజక సంబంధమైన కానుకలు. పరిశుద్ధ, అతిపరిశుద్ధమైన స్థలాలలో దేవునికి తగినట్టు సువాసనతో అర్పించబడే ఆ సుగంధ సంభారంలో సాంబ్రాణి ఒకటి. సాంబ్రాణి పూజించడానికి, ప్రార్థనకు, అర్పణకు చిహ్నముగా ఉంది.బోళము ఎల్లవేళలా పచ్చగానుండే ఒక చెట్టు యొక్క బంకనుండి అది తయారు చేయబడుతుంది.  బోళము మరణ పునరుత్తానానికి సాదృశ్యముగా ఉంటుంది.   ప్రవక్తలు, యాజకులు అభిషేకించబడడానికి బోళాన్ని వాడేవారు. అంటే క్రీస్తు ప్రభువు అభిషిక్తుడు అని చెప్పడానికి ఇది సూచన.

ఈ విధంగా ముగ్గురు జ్ఞానులు ప్రభువుని కనులారా దర్శించి, ఆరాధించి విలువైన  కానుకలర్పించి, ధన్యులయ్యారని మత్తయి సువార్తలో చెప్పబడుతుంది.చెడ్డ రాజైన హేరోదు యేసును చంపాలనుకున్నాడు కాబట్టి, ఆయన  దగ్గరకు తిరిగి వెళ్లొద్దని దేవుడు కలలో వారిని హెచ్చరించాడు. కాబట్టి ‘వాళ్లు మరో మార్గాన తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. 

Add new comment

10 + 6 =