పునీత జాన్ మరియ వియాన్ని | Saint of the day | 4 August

దుర్భరమైన కాలమది. మతాధికారుల యెడల తీవ్రవ్యతిరేకత పెల్లుబుకుతున్న రోజులవి. మత విశ్వాసం `యెడ మక్కువ కోల్పోయి విచ్చలవిడిగా ప్రజలు సంచరిస్తున్నారు. ఫ్రెంచి విప్లవం చెలరేగి యూరపును కుదిపివేసిన దినాలవి. అట్టి గడ్డు పరిస్థితుల్లో ఫ్రాన్సుదేశం నైరుతి ప్రాంతమైన లయన్సు నగరానికి ఆరుమైళ్ల దూరంలో ఉన్న డర్డిల్లీ గ్రామంలో జాన్ మరియ బాప్టిస్ట్ వియాన్ని జన్మించారు. తండ్రి మాత్యూ. వ్యవసాయి. వియాన్ని బాల్యం అంతాకూడ వ్యవసాయ పనుల్లోనే గడచింది. ఇతని సోదరి కాథరీన్ పెళ్లికి ధనం సమకూర్చుకోవడంలోనే తండ్రి తలమునకలయ్యేవాడు. తమ పేదరికంవల్ల కుమారుడు జాన్ మరియను చదివింపక పెద్దగా పట్టించుకోలేకపోయాడు. అయితే డ్యూజోవర్ పాయింట్లో నివసిస్తున్న తన తల్లి తరఫు తాతగారింట్లో ఉండి ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఎంతైనా చదువులో రాణింపు లేక చాలా వెనుకబడి ఉన్నాడు.

మరియ వియాన్ని తన 13వ ఏట ప్రథమ దివ్యసత్రసాదాన్ని లోకొన్నారు. క్రమంగా గురువు కావాలన్న కాంక్ష వారిలో తీవ్రమైంది. 1806లో ఈ కల్లీ విచారణ గురువైన చార్లెస్ బార్లీగారి వద్ద ఉండి గురు శిక్షణ విద్యగరిపారు. లాటిను బాష, గురు విద్యాంశాలు నేర్చుకున్నారు. తనకు 20 ఏళ్లు వచ్చినా చదువు తనకు అబ్బడంలేదు. అందువల్ల అస్వస్థతకుకూడ గురయ్యేవారు. 1803లో నెపోలియన్ కూ ఏడవ పయస్ పోపుగారికీ జరిగిన ఒప్పందం ప్రకారం గురు విద్యార్థులు విధిగా సైనికశిక్షణలో చేరాల్సిన అవసరంలేదు. కాని ఏదో పొరపాటు జరిగి మరియవి యాన్నికి సైన్యంలో చేరమని కాగితాలు వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో 1809 అక్టోబరు 26న సైన్యంలో చేరాడు. కాని జబ్బున పడి ఇంటికొచ్చేశాడు. మళీ చార్లెస్ బార్లీ గురువు వద్దనే చదువు కొనసాగించారు.

1813 అక్టోబరునాటికి లయన్సు పట్టణంలో నెలకొన్న ఇన్యాసిగారి గురు విద్యాలయంలో చేరేందుకు విద్యార్హతనొంది అందు ప్రవేశించారు. లాటిను భాషనేర్వడం కష్టమైంది. తొమ్మిది మాసాల పరీక్షలో అన్నింటిలో వెనుక బడిపోయారు. పెద్దలు ఇంటికి పంపేయాలను కున్నారు. కాని వీరి గురువు బార్లీగారి సిఫారసు మేరకు గురువిద్యలో ఉండనిచ్చారు. 1815 ఆగష్టు 13న గ్రెనోబుల్ పట్టణ దేవాలయంలో గురు పట్టాభిషిక్తులయ్యారు. అక్కడే ప్రథమ దివ్య బలి పూజనర్పించారు. అప్పటికి వాటర్లూ యుద్దం జరిగి రెండు నెలలు దాటింది. వీరి గురు పట్టాభిషేకానికి అనుమతించే ముందు లయన్సుకు చెందిన వికార్ జనరలుగారు “శ్రీసభకు బాగా విధ్వాంసులైన గురువులు మాత్రమేకాదు. దైవ సేవకు అంకితమైపోయే గురువులు కూడా చాలా అవసరం" అని నొక్కివక్కాణించారు. పిమ్మట ఫాదర్ జాన్ మరియవియాన్నిగార్ని ఈ కల్లీ విచారణకు బార్లీ గురువర్యులకు సహాయకులుగా పంపించారు. బాబ్రీ స్వామి 1817 డిసెంబరు 17న మరణించగా రెండు మాసాలనంతరం లయన్సు నగరం సమీపంలో 'ఆర్స్' అనే ఓ మారుమూల గ్రామంలో విచారణ గురువుగా నియమితులయ్యారు. అప్పటికివారి వయస్సు 32 సం||లు.

ఆర్స్ గ్రామంలో అప్పటికే క్రైస్తవ విలువలు క్రిందిస్థాయికి దిగజారాయి. వాళ్లలో అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన బాధ్యత ఫాదర్ వియన్ని పై బడింది. ప్రారంభంలో విచారణలోని పేదలు, రోగుల్ని పరామర్శిస్తూండేవారు. తరచూ గంటల తరబడి దివ్య సత్ర్పసాదం ఎదుట మోకాళ్లూని తన విచారణ ప్రజల మనో పరివర్తనకై ప్రార్థించారు. ఆర్స్గ్రామంలో పెద్దకట్టడమంటే అక్కడి చిన్న గుడి మాత్రమే. స్త్రీలు, పిల్లలు మాత్రమే ఆదివార పూజలకు వస్తుండేవారు. అందువల్ల పొలాలకు కూడ పోయి గుడికి రాని జలయొద్దకు వెళ్లి వారి మధ్యాహ్న భోజనసమయంలో వారి మధ్య చేరి చెప్పేవారు. జాన్సనిజమ్ వల్ల అడుగంటిన విశ్వాసాన్ని వారిలో ప్రోదిచేశారు. మారుచేసుకున్న తన ప్రసంగాలతో, మంచి పాపసంకీర్తనలతో ఆదర్శ కాలలో ఆర్స్ విచారణ రూపురేఖల్నే మార్చివేశారు. రానురాను ఆదివారం నాటి దివ్యపూజకు మగవాళ్లు కూడ రావడం ఆరంభమైంది. ఫాదర్ వీయాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్లంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు..

పోదించడంలో వియాన్నీ ఆనాటి బోధకులలోకెల్లా మేటి బోధకుడనిపించు వారు. గురువుల శిక్షణకు సరియైన సదుపాయాలు లోపించిన రోజుల్లోకూడ వారు శ్రమించి అంతటి అర్హతను సముపార్జించారు. ఫ్రెంచి విప్లవ సమయంలో ఆధ్యాత్మికాభివృద్ధి కుంటు బడటంవల్ల మత పుస్తకాల సదుపాయం లభ్యమయ్యేదికాదు. వియాన్నిగారు 1750లో తొలన్ పీఠాధిపతులైన డిచౌన్గారిచే గురువిద్యార్థులకై గురుతర సూచనలు చేస్తూ ప్రచురింపబడిన చిఱుపుస్తకాన్ని చదివి చదివి గతంలో తాను గురుపట్ట వెందడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని ప్రోదిచేసుకున్నారు. ఏ విధంగా చూసినా వారు అంతగా చదువురాని గురువుల కోవకే చెందుతారు. తన ముక్కుసూటి పట్టుదలవల్ల త్రాగుడు, నృత్యం పనికిరాదని అవి పాపానికి హేతు వులని పట్టుబట్టగా క్రైస్తవులచే తిరస్కరింపబడి కష్టాలపాలయ్యారు. తిరిగి వారి ప్రార్థన భక్తిచూసి క్రైస్తవులు వియాన్నిగార్ని అంగీకరించారు.

వియాన్నిగారు ఆర్స్ దేవాలయాన్ని గోపురంతోను పెద్ద పీఠంతోను విస్తరింపచేసి విశ్వాసులందరి ప్రవేశానికి దోహదంచేశారు. అనాథలకు, దిక్కూ మొక్కూలేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాల ప్రారంభించారు. వారికి పొలంపనులు, గృహసంబంధ పనులు కూడ నేర్పించేవారు. వీటి నిర్వహణకై లయన్స్ నగరవీధుల్లో భిక్షాటనచేసి ఆర్థిక వనరులు సమకూర్చేవారు. వియాన్నీగారు పవిత్రాత్మ సహకారంతో పాప సంకీర్తనలు ఆలకించి వారి వారి ఆత్మీయ అవసరాలకు తగినట్లుగా ఆథ్యాత్మిక సూచనల్ని ఎంతో నేర్పుగా ఇస్తున్నారన్న వార్త అంతటా వ్యాపించింది. వారు పశ్చాత్తాప పడనీ పాపాల్ని గురించికూడ పాపసంకీర్తన చేసేవారికి జ్ఞప్తికి తెచ్చి ప్రార్థించేవారు. వీరి ప్రార్ధనలవల్ల ఆత్మారోగ్యంతో పాటు శారీరక స్వస్థలుకూడ సమకూరడం భక్తులనబ్బుర పరిచింది. ఈ విషయం యూరపు అతట ప్రాకి ఫాదర్ వియాన్నిగారి వద్ద పాపసంకీర్తన చేయడం కోసం ఒక యాత్రలా విశ్వాసులు రావడం మొదలైంది. రోజుకు 14నుండి 18 గంటలు వరకు వియాన్ని గారు ఓపికతో పాపసంకీర్తన సంస్కారముందించేవారు.

ఇంత పేరు గడించినా తాను  అజ్ఞానియని, పనికిరాని గురువుసని చెప్తుండేవారిని  పట్టించుకోలేదు వియాన్నిగారు తమ నడివయస్సులో నుండగా సాతాను చాలాసార్లు  బాధ పెట్టింది. వారి ఆరోగ్యాన్ని కూడ దెబ్బతీసింది, భయంకర మైన శబ్దాలు, దృశ్యాలు, గొడవలతో వేధించింది. 1824 శీతాకాలంలో మొదటి సంఘటన  జరిగింది. రాత్రుళ్లు గుడితలుపులు బాదుతున్నట్లు, దొడ్లోనుండి ఏవో వింత అరుపులు,  సైనికుల పెడబొబ్బలు భయానకంగా విన్పించేవి. తెల్లారాక చుక్కల నడిగితే తమకేమీ ఆ ధ్వనులు వినబడ లేదనేవారు. అప్పడు  వారికీ అర్ధమయినది ఇది  సాతాను పనియని. దేవుడు తన బిడ్డలను భయపెట్టడని చెప్పారు. ఇలా 21 సం||లు సాతానుతో ఘర్షణపడి చికాకు నిద్రలేమివల్ల పళ్లసలుపు,ముఖం పాలిపోవడం,  కడుపులో నొప్పి ఇతర రోగాలు చుట్టుకుని దృడుడిలా కన్పింప సాగారు. తన  వృద్ధాప్యంలో కూడ పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు. పెద్దలకు మంచి ఉపన్యాసాలతో గురుత్వ సేవలందించేవారు. పాతబడిన చిన్న ఇల్లు,సామాను అంతగాలేని చిన్నగదిలో కాలం వెళ్లబుచ్చేవారు.

వియాన్నిగారి పేరు ప్రతిష్టలు ఫ్రెంచి ప్రభుత్వ దృష్టికికూడ పచ్చాయి. 1850లో “ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్' అనే వీరయోధ  బిరుదును  ప్రకటించింది. దానికి 12 ఫ్రాంకులు రుసుము చెల్లించాలని తెలిసినప్పడు “ఆ పండ్రెండు ఫ్రాంకులతో పండ్రెండు మంది పేదలకు అన్నదాసం చేయవచ్చుకదా!” అని దాని పట్ల ఉదాసీన భావాన్ని వెలుబుచ్చారు. ఆ గౌరవ హోదాకు చిహ్నంగా ప్రభుత్వంవారిచ్చిన “రిబ్బను” వారేనాడూ ధరింపరైరి. వారి మరణానంతరము దానిని వారి చొక్కాకు తగిలించారు.

1845లో సాతాను వియాన్నిగార్ని బాధపెట్టడం మానేసింది. ఆర్చ్ విచారణలో 41 సం||లు సేవలందించాక చివరి రోజుల్లో కేవలం 3 వారాలు మాత్రమే జబ్బునపడ్డారు. అస్వస్థతలో తానిక 3 వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణంగూర్చి ముందుగానే తెల్పారు. అలాగే జరిగింది. 1859 ఆగస్టు 4న పరమపదించారు. అంత్య సమయంలో పీఠాధిపతి, ఇరవై మంది గురువులు  మంచం చుట్టూ నిలబడి ప్రార్థన చేశారు. ప్రశాంతంగా వారి దేహయాత్రను చాలించడం చూశారు.

1950 జనవరి 9న పదవ పయస్ (భక్తినాథ) పోపుగారు వియాన్ని గారికి ముక్తి భాగ్య పట్టాకట్టారు. తరువాత 1955 మే 31న పదకొండవ పయస్ పోపుగారు పునీత పట్టాభిషిక్తుల గావించారు. గురువంటే ప్రజల మనిషని ప్రజల అవసరాలకు మించిన మరేపని గురువలకు ముఖ్యంకాదని పునీత వియాన్నిగారి జీవితాదర్శం తెల్పుతోంది. అందుకే వీరిని విచారణ గురువల పాలక పునీతులుగా శ్రీసభ గుర్తించింది. మరియ అనగా ఏలినరాలు, యజమానురాలు, ప్రసస్త కన్య అని అర్థం.

 

Add new comment

2 + 4 =