Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
పునీతుడు కానున్న ధన్య జీవి కార్లో అక్యూటీస్
పునీతుడు కానున్న ధన్య జీవి కార్లో అక్యూటీస్
పోప్ గార్లు, గురువులు, కన్య స్త్రీలు, రాజులు, రాణులు, మేధావులు మరియు తమ జీవితాలను క్రీస్తు ప్రభువునకు సాక్ష్యంగా అర్పించిన పునీతుల ఎందరో ఉన్నారు. జీన్స్ మరియు టీషీర్ట్ వేసుకున్న ఒక యువ తార పరిశుద్ధ "కార్లో అక్యూటీస్" గారు త్వరలో పునీతులలో ఒకరిగా చేరబోతున్నారు. మే 3 , 1991 న ఇటలీ చెందిన ఒక కథోలిక జంటకు లండన్ లో ఈయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులైన ఆండ్రియా మరియు అంటొనియా సల్జానో అక్యూటీస్ సెప్టెంబర్ 1991 లో మిలాన్ లో స్థిరపడిపోయారు.
కార్లో తన ప్రాధమిక విద్యనంతా మిలాన్ లోనే పూర్తి చేసారు. చిన్న తనంలో కార్లో ఎందరినో తన జీవిత ఆదర్శాలుగా పరిగణించుకునే వారు. ముఖ్యంగా పునీత అస్సిసి ఫ్రాన్సిస్, పునీత ఫ్రాన్సిస్కో, పునీత జెసిత మార్టో, పునీత డొమినిక్ సవియో మరియు పునీత బెర్నాడెట్ వంటి వారిని తన జీవిత ఆదర్శాలుగా పరిగణించుకునేవారు. ఏడు సంవత్సరాల పసి ప్రాయంలో ఆయన సత్ప్రసాద దేవద్రవ్య అనుమానాన్ని స్వీకరించారు. ఆ రోజు నుండి ప్రతి దినం దివ్యబలిపూజకు హాజరు అయ్యేవారు. సమయం దొరికినప్పుడల్లా పరిశుద్ధ దివ్య సత్ప్రసాదంలోని ఆ ప్రభువును ఆరాధించడానికి దివ్య మందసము ముందు కూర్చొని గంటల కొద్దీ సమయం గడిపేవారు. ఆ సత్ప్రసాదమే పరలోకానికి రహదారి అని ఆయన అనేవారు.
కార్లో గారికి తల్లి మరియ అంటే ప్రత్యేకమైన భక్తి ఉండేది. ప్రతి రోజు క్రమం తప్పకుండ జపమాలను జపించేవారు. వారానికి ఒక్క సారైనా పాపసంకీర్తనం చేసేవారు. పునీతులు వెలసిన, జీవించిన పుణ్య క్షేత్రాలకు మరియు సత్ప్రసాద అద్భుతాలు జరిగిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళమని ఆయన తన తల్లిదండ్రులను నిత్యం కోరేవారు. తన తల్లిద్రండ్రులు అంత భక్తిపరులు కాకపోయినా, వారిని మరియు తన బంధువులని ప్రతిరోజూ దివ్యబలిపూజకు రావలసిందిగా ఆయన ప్రాధేయపడేవారు.
తన పాఠశాలలో వేధింపులకు గురవుతున్న తన తోటి విద్యార్థులకు ఆయన అండగా నిలిచే వారు. ముఖ్యంగా అంగ వైకల్యం కలిగిన వారికి ఆయన ఎల్లప్పుడూ సహాయం చేసేవారు. ఒక సందర్భంలో తన స్నేహితుని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడానికి సిద్ధ పడగా, ఆ స్నేహితుని తన కుటుంబములో సభ్యునిగా చేర్చుకున్నారు కార్లో.
అంతే కాదు, కార్లో గారికి కంప్యూటర్ల పట్ల అసాధారణమైన జ్ఞానం ఉంది. తాను స్వంతగా రూపొందించిన ఒక వెబ్ సైట్ లో ప్రపంచ నలుమూలలా జరిగిన దివ్య సత్ప్రసాద అద్భుతాలను పొందుపరిచి వాటిని గూర్చిన ఎన్నో వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి పంచేవారు.
మనం ఎన్ని ఎక్కువ సార్లు దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరిస్తామో క్రీస్తు తో అంత సారూప్యత కలిగి ఉంటామని ఆయన తరచూ చెప్తుండేవారు.
15 ఏళ్ళ పసి ప్రాయంలో అక్టోబర్ 15 , 2006 న ఈయన లుకేమియా అనగా కాన్సర్ తో మరణించారు. తదనంతరం తన కోరిక మేరకు, పునీత అస్సిసి ఫ్రాన్సిస్ వారి పై తనకు ఉన్న ప్రేమ వల్ల ఆయనను అస్సిసి లో భూస్థాపితం చేసారు.
"నా బాధలు, శ్రమలను దేవునికి, పోప్ గారికి మరియు కథోలిక సమాజానికి సమర్పిస్తున్నానని , నా జీవితంలో ఒక్క క్షణం కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చెయ్యకుండా, పరిపూర్తిగా జీవించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని" మరణానికి ముందు ఆయన అన్నారు.
ఆయన క్రీస్తు తో, క్రీస్తు కొరకు మరియు క్రీస్తు నందు తన జీవితాన్ని జీవించారు.
ఈయనను పునీతునిగా ప్రకటించడానికి కావలసిన ప్రక్రియ 2013 లోనే ప్రారంభమయింది. మే 13 , 2013 న కార్లో ను దేవుని సేవకునిగా ప్రకటించడం జరిగింది. కార్లో గారి వీరోచిత జీవితం గురించి తెలుసుకున్న ఫ్రాన్సిస్ పోప్ గారు జులై 5 , 2018 న కార్లో గారికి ధన్యత పట్టాను ప్రకటించారు.
అరుదైన క్లోమ గ్రంధి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిట్టిస్ అనే బ్రెజిల్ బాలుడు 2013 లో కార్లో గారి గురించి తెలిసి, ఆయన ప్రార్ధనా సహకారం కోసం ప్రార్ధన చెయ్యగా, అద్భుత రీతిలో ఆ బాలునికి స్వస్థత కలిగింది. ఫిబ్రవరి 21 , 2020 న ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ అద్భుతాన్ని ఆమోదించడం ద్వారా కార్లో గారిని పునీతునిగా ప్రకటించడానికి బాటలు వేశారు.
కార్లో ఈ తరం బాలుడిని, అంతర్జాల ప్రపంచంలో జీవించిన బాలుడిని ఈ డిజిటల్ యుగంలో పవిత్రతకు నిదర్శనం కార్లో అని పోప్ గారు కొనియాడారు.
అక్టోబర్ 1 , 2020 న ధన్య కార్లో గారి సమాధిని తెరిచి ఆయన దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచారు.
కార్లో గారికి పేదవారంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండేదని, తాను దాచుకున్న డబ్బు తో నిరాశ్రయులకు, భిక్షగాళ్లకు, వీధులలో రోడ్ల పైన నిద్రించే వారికి పరుపులు కొని ఇచ్చేవారని, విచారణలో అనేక కార్యక్రమాలు నిర్వహించి, డబ్బు పోగు చేసి దానిని పేదల సహాయార్ధం ఉపయోగించేవారని కార్లో గారి తల్లి గుర్తు చేసుకున్నారు. ఒక కొత్త జత బూట్లు కొనుక్కోవడానికైనా తాను ఇష్ట పడే వారు కాదని, ఆ డబ్బుతో ఒకరికి సహాయం చేయొచ్చు అనేవారని ఆమె చెప్పారు.
ఫుట్ బాల్ మరియు వీడియో గేమ్స్ ఆంటే అమితమైన ఇష్టం ఉన్న కార్లో గారు, తన కాళీ సమయంలో capuchian ఫాదర్ లు మరియు మదర్ తెరెసా సంస్థ కన్య స్త్రీలు కలిసి నడుపుతున్న ఒక వంట శాలలో స్వచ్చందంగా పని చేసే వారు.
యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు జీవించును? దేవుని ఆజ్ఞలను పాటించుట వలననే.
నేటి అత్యాధునిక ప్రసార మాధ్యమాలతో కలిసి జీవిస్తున్న యువతకు ధన్య కార్లో గారి జీవితం ఎంతో ఆదర్శవంతం.
పవిత్రత మనకు అందుబాటులో ఉన్నదే ఎందుకంటే దేవుడు అందరి కొరకు ఉన్నాడు.
అంతర్జాలానికి, విద్యార్థులకు, యువతకు పోషకుడైన యువ కార్లో, యువకులు పవిత్ర జీవితం జీవించడం సాధ్యమని రుజువు చేసారు.
Add new comment